పుట:Prasarapramukulu022372mbp.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

103

కార్మికుల కార్యక్రమంలో Family Serialలో వీరు ప్రధాన పాత్రలు పోషించారు. భువనేశ్వరి, ఇందిరాదేవి, నిర్మలావసంత్, ఇలియాస్ అహమ్మద్, M. N. శాస్త్రి, జ్యోత్స్న, శేషారత్నం, పండా శమంతకమణి తమ సుమధుర కంఠాల ద్వారా శ్రోతలకు చిరపరిచితులు. జ్యోత్స్న అనౌన్సర్ నుండి తెలుగు న్యూస్ రీడర్‌గా విజయవాడలో పనిచేసి ప్రస్తుతం హైదరాబాదు వార్తా విభాగంలో ఉన్నారు. అలానే దివి వెంకట్రామయ్య చక్కని రచయిత, నవలలు, కథలు వ్రాశారు. పండా శమంతకమణి తెలుగులో వ్రాసిన రామకథకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. శ్రీమతి M. G. శ్యామలాదేవి రేడియో నాటక విభాగంలో మూడు దశాబ్దాలు పనిచేసి. పదవీ విరమణ చేశారు. E. కపర్ది సౌజన్యంగల వ్యక్తి. మల్లాది చంద్రశేఖర్, సాధన చక్కటి నైపుణ్యం గల వ్యక్తులు.

హైదరాబాదు వివిధభారతి, వాణిజ్య ప్రసార విభాగంలో అనౌన్సర్లుగా పనిచేస్తున్నవారు బహుముఖ ప్రతిభావంతులు. సర్వశ్రీ ఉమాపతి బాలాంజనేయశర్మ, ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి, సీత, ఇందిరా బెనర్జీ, మట్టపల్లి రావు, రాజగోపాల్, రూప్‌లాల్ ఆ యా రంగాలలో కృషి చేశారు. ఆకెళ్ళ దంపతులలో సత్యనారాయణమూర్తి అనారోగ్యంతో కాలధర్మం చెందారు. ఆయన చాలా టి. వి. నాటకాలలో నటించారు. బాలంజనేయశర్మ వాక్శుద్దిగల పండితుడు. మట్టపల్లి రావు రూపొందించిన రూపకాలకు జాతీయస్థాయిలో ఆకాశవాణి బహుమతులు లభించాయి. ఇందిరా బెనర్జి సంపన్న కుటుంబంలో జన్మించి ఆకాశవాణి పట్ల అభిమానంతో పని చేస్తున్నారు. పుష్పలత అనే అనౌన్సరు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా UPSC ద్వారా సెలక్టు అయి కొంతకాలం దూరదర్శన్‌లో పనిచేసి రాజీనామా చేశారు.

విజయవాడ కేంద్రంలో పనిచేసి పదవీ విరమణ చేసిన అనౌన్సర్లు లబ్ద ప్రతిష్టలు. సర్వశ్రీ కూచిమంచి కుటుంబరావు, శ్యామసుందరి, లత, కమలకుమారి, A. B. ఆనంద్, పేరి కామేశ్వరరావు, కోకా సంజీవరావు, A. లింగరాజు శర్మ, వెంపటి రాధాకృష్ణ కేవలం అనౌన్సర్లుగానే గాక ఇతర కార్యక్రమాల ద్వారా ప్రసిద్ధి పొందారు. కుటుంబరావు చక్కటి కంఠస్వరం గల వ్యక్తి. వీరు నటించిన నాటిక నేడు నాటకం రసవత్తరంగా సాగింది. లత రచయిత్రిగా పేరు తెచ్చుకొన్నారు. డ్రామా వాయిస్‌లుగా సర్వశ్రీ సి. రామమోహనరావు, నండూరి సుబ్బారావు, వి. బి. కనకదుర్గ, సీతారత్నమ్మ ప్రముఖులు.