పుట:Prasarapramukulu022372mbp.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

ప్రసార ప్రముఖులు.

ఆంధ్రలో వివిధ కేంద్రాలు

ఆకాశవాణి హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్టణం కేంద్రాలు చిరకాలంగా పనిచేస్తుండగా ఆరవ పంచవర్ష ప్రణాళికలో జిల్లా స్థాయి రేడియో కేంద్రాలు స్థాపించాలనే నిర్ణయానుసారం ఐదు కేంద్రాలు ప్రారంభించారు. తమిళనాడులోని నాగర్ కోయిల్ లో 1984 అక్టోబరులోను, ఆంధ్రప్రదేశ్ లోని ఆదిలాబాద్ లో 84 లోను, మహారాష్ట్రలోని షోలాపూర్ లో, రాజస్థాన్ లోని కోటలో, ఒరిస్సాలోని ఖేన్ జర్ లో ఐదు కేంద్రాలు ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రసారం ఈ కేంద్రాల లక్ష్యం, జనజీవన స్రవంతిలో ప్రసార కేంద్రం ఒక భాగం కావాలని ప్రభుత్వ లక్ష్యం.

అదిలాబాదు :

హైదరాబాదు కేంద్ర ప్రసారాలు మారుమూల తెలంగాణా ప్రాంతమైన అదిలాబాద్ జిల్లాలో వినిపించడం లేదనే కారణంతో అదిలాబాద్‌లో 1 కిలోవాట్ ప్రసారశక్తి గల మీడియంవేవ్ కేంద్రాన్ని సాయంకాలం ప్రసారాలతో ప్రారంభం చేశారు. సి. రాజగోపాల్ తొలి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా ఈ కేంద్రం హంగామా లేకుండా 12-10-1986లో ప్రారంభమైంది. అదిలాబాద్ ప్రాంతం జానపద సంగీతానికి ప్రసిద్ధి. యన్. యమ్. జి. రామకృష్ణ, కె. బి. గోపాలం (డైరక్టర్) అక్కడ పనిచేశారు. సుదూర ప్రాంతం కావడం, కనీస వసతులు లేకపోవడం వల్ల ఈ కేంద్రాన్ని 'difficult station' గా ఆకాశవాణి ప్రకటించింది. ఈ కేంద్రం మూడు గంటల స్వతంర కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. జిల్లా వరకే ఈ కార్యక్రమాలు పరిమితమైనా అదిలాబాద్ జిల్లా సువిశాలమైన జిల్లా కావడంవల్ల జిల్లా మొత్తంమీద శ్రోతలు ఈ కార్యక్రమాలు వినిపించడం లేదు. గత దశాబ్ది కాలంలో ఈ కేంద్రం గణనీయమైన ప్రగతి సాధించలేదు.

యఫ్. యం. కేంద్రాలు :

మీడియం వేవ్ కేంద్రాల బ్యాండుపై వందకుపైగా ప్రసార కేంద్రాలు రావడంతో 'జామ్‌' అయిపోయే క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. దాన్ని అదిగమించడానికి, అంతర్జాతీయ ఫ్రీక్వెన్సీ సంస్థ వారిచ్చిన రెండు వందల ఫ్రీక్వెన్సీలు వాడుకోవలసి రావడం వల్ల భారత ప్రభుత్వం ఏడవ పంచవర్ష ప్రణాళికలో జిల్లా స్థాయి యఫ్. యం. కేంద్రాలను విశేషంగా ప్రారంభించారు.