పుట:Pranayamamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆపైన ఎడమముక్కుతో పూరకముచేసి, కుడిముక్కుతో రేచకము చేయుము.

సాధనా సమయమందంతటను 'ఓం' ను భావార్థ సహితముగ జపించుము.

కొన్నిరకముల భస్త్రికలలో, స్వాసోచ్చ్వాసలలో ఒకే ముక్కును ఉపయోగించుటయు, లేక ఒకటి విడచి ఒకటిగా (Alternate) ఉపయోగించుటయు గలదు.

చాలసేపటివరకు తీక్ష్ణముగ భస్త్రిక ప్రాణాయామము చేయగోరువారు ఆహారముగ ఖిచడీ తీసికొనవచ్చును. సాధనకు కూర్చొనబోవుటకు ముందు ఉదయమున ఎనిమాగాని బస్తినిగాని చేసికొనవలెను.

భ్రామరి

పద్మ లేక సిద్ధాసనములో కూర్చొనుము. తేనీగవలె ఝుమ్మనుధ్వని చేయుచూ త్వరత్వరగా రెండుముక్కులతోను పూరక రేచకములను చేయుము.

ఈవిధముగా శరీరము అంతయూ చెమటపోయు నంతవరకు చేయుము. చివరకు రెండుముక్కులతోను గాలిపీల్చి, ఆపగలిగినంతసేపు లోపల కుంభకముచేసి, నెమ్మదిగా అటుపైన రెండుముక్కులతోను గాలిని విడువుము. ఈ కుంభకము చేయుట వలన సాధకుడు పొందు ఆనందము వర్ణనాతీతము. మొదటిలో రక్తప్రసారము తీవ్రముగ జరుగుటవల్ల శరీరము వేడి ఎక్కును. చివరకు చెమటవల్ల ఆవేడి తగ్గును. ఈ కుంభకము సిద్ధించిన వానికి సమాధి సిద్ధించును.