పుట:Pranayamamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీత్కారి

నాలుకమొన పై అంగిలికి తాకులాగున నాలుకను వంచి, సీ, సీ, సీ, సీ అను శబ్దము వచ్చులాగున నోటితో గాలిని పీల్చుము. తరువాత ఊపిరి సలపకుండ వుండునంతసేపటి వరకు గాలిని లోపలకుంభించి, నెమ్మదిగా రెండు ముక్కులతోను గాలిని విడువుము. గాలిని పీల్చునప్పుడు రెండు పంటివరసలను(క్రింది, పైని) దగ్గరకు చేర్చవచ్చును.

ఇందువలన శరీరమునకు వన్నె, దార్డ్యము వచ్చును. ఆకలి, దప్పిక, బద్ధకము, నిదురమత్తులు లేకుండ పోవును. ఇంద్రునంతటి బలశాలి యగును. యోగులకు ప్రభువగును. ఏదైన చేయుటకుగాని, కాకుండ చేయుటకు గాని సమర్థుడగును. స్వతంత్ర చక్రవర్తి వలె అగును. అజేయుడగును. ఏ విధమగు ఆపదలు అతని దరిజేరజాలవు. దాహము వేసినప్పుడు ఈ కుంభకము చేసినచో, దాహము తగ్గిపోవును.

శీతలి

నాలుకను పెదవుల బయటకు కొద్దిగా రానిమ్ము. గొట్టమువలె నాలుకను వంచుము. సీ, సీ, సీ, సీ అను శబ్దమువచ్చు లాగున నోటితో గాలిని పీల్చుము. నీవు శ్రమలేకుండ ఆపుచేయ గలిగినంత సేపటివరకు గాలిని లోపల ఆపుచేయుము. తరువాత రెండు ముక్కులతోను, గాలిని నెమ్మదిగాబయటకు విడువుము. ప్రతిరోజు ఉదయమున 15 నుండి 30 పర్యాయములవరకు ఈ విధముగ చేయుచుండుము. ఈ అభ్యాసమును పద్మ, సిద్ధ, వజ్రాసనములలోగాని, నడచుచు లేక నిలబడిగాని చేయవచ్చును.