పుట:Pranayamamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిమ్మట, నీవు సుఖముగా ఆపుజేయగలిగినంత సేపటి వరకు గాలిని లోపల కుంభించి, కుడి ముక్కును కుడి బొటన వ్రేలితో మూసి, ఎడమ ముక్కుతో నెమ్మదిగా గాలిని విడవుము. గాలిని పీల్చు నప్పుడు రొమ్మును విశాలముగ (Expans'on) వుంచుము. ఈ రీతిని గాలిని పీల్చునప్పుడు కంఠ బిలము ఒక వైపు మాత్రమే మూసికొని యుండుటచే ఒక విధమగు విచిత్రమైన ధ్వని పుట్టును. ఇది సమముగను నెమ్మదిగను వుండవలెను. అంతేగాక, యిది చివరవరకు వుండును. ఈ రకపు కుంభకమును నడచు నప్పుడుగాని, నిలబడి గాని చేయవచ్చును. ఎడమ ముక్కుతో గాలి విడచుటకు బదులుగా రెండు ముక్కులతో కూడ నెమ్మదిగా గాలిని విడవవచ్చును.

ఇది తలయందు గల వేడిని పోగొట్టును. జఠారాగ్ని వృద్ధియగును. సాధకునకు అందమువచ్చును. జలోదరమును కుదుర్చును. శరీరములో గల దోషములను, ధాతువులలో గల దోషములను పోగొట్టును. గొంతులో గల శ్లేష్మమును పోగొట్టును. క్షయ, ఉబ్బసము తదితర పుప్పుసీయ వ్యాధులను నిర్మూల మొనర్చును. ప్రాణవాయువు కొరత వల్ల కలుగు జబ్బులున్నూ హృద్రోగమున్నూ నివారణ యగును. ఉజ్జయి ప్రాణాయామముచే అన్ని కార్యములు సిద్ధించును. శ్లేష్మ నరముల వ్యాధులు, మందాగ్ని, రక్తగ్రహణి, ప్లీహోదరము, క్షయ, దగ్గు, జ్వరములు ఈ కుంభకము చేయు సాధకుని దగ్గరకు రాజాలవు. వార్ధక్యమును, చావును లేకుండా చేయును.