పుట:Pranayamamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందలి రోమములన్నిటినుండిన్నీ, గోళ్ళ మొనలనుండిన్నీ చెమట బిందువులు బయలుదేరు నంతవరకు చేయవలెను. మొట్ట మొదటిసారిలోనే యింతసేపటివరకు కొందరు చేయలేక పోవచ్చును. అట్టివారు క్రమక్రమముగ కుంభకము చేయు కాలమును అధికము చేసికొనుచూ రావచ్చును. ఇదియే సూర్యభేధ కుంభకముయొక్క పరిమితి. తరువాత గాలిని నెమ్మదిగా కుడిముక్కును కుడి బొటనవ్రేలితో మూసి, ఎడమముక్కు గుండా ఏ విధమగు శబ్దము లేకుండ విడువవలెను. రేచక పూరక కుంభక సమయములందు 'ఓం'ను భావము, అర్ధములతో స్మరించుము. శ్వాసను పైకి పూఱ్ఱెవైపుకు పోనిచ్చి, పుఱ్ఱెను పరిశుద్ధపరచిన పిదప విడవుము.

ఇది మెదడును పరిశుద్ధపరచును. ప్రేవులందలి నులిపురుగులును నాశనమొనర్చును. వాతాధిక్యతచే వచ్చు రోగములను నివారణ చేయును. కీళ్ళవాతమును పోగొట్టును. అన్ని విధములగు మజ్జాతంతు వేదన (Newralgia) లను, రినిటిన్ (Rhinitis), సెఫలాల్జియా (Cephalalgia)లను నిర్మూల మొనర్చును. నాడీప్రణ ముఖము నందలి క్రిములను పారద్రోలును. వృద్ధాప్యము మరణమును లేకుండా చేయును. కుండలినీ శక్తిని మేల్కొలుపును.

ఉజ్జయి

పద్మాసనము లేక సిద్ధాసనములో కూర్చొనుము. నోటిని మూయుము. నెమ్మదిగా రెండుముక్కులతోను సమానముగ, గొంతునుండి హృదయ ప్రదేశమువరకు నిండులాగున గాలిని పీల్చుము.