పుట:Pranayamamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెరవేర్చుటకు ప్రయత్నించును. హిందూయోగులు ధారణా మహిమచే భిన్నభిన్నములగు నూరు విషయములను గురించి జ్ఞప్తియుంచుకొని శతావధానమును చేతురు. ఈ శతావధాని (శతావధానము చేయువాడు) ఒకరితరువాత, మరొకరు త్వరత్వరగ వేయు నూరు ప్రశ్నలను జ్ఞప్తి యందుంచుకొని వరుస ప్రకారము జాగరూకతతో జవాబు చెప్పుచుండవలెను. ఈ ప్రశ్నలు వేయువారు ఆలోచించు కొనుటకుకూడ వీలు లేకుండు నంత త్వరగ వివిధవిషయములపై ప్రశ్నలను వేసెదరు. అప్పుడీ శతావధాని ఏ మాత్రము తొట్రుపాటు, ఆలస్యము లేకుండ ఎవరు వేసిన ప్రశ్నలకు, ఏ జవాబు లివ్వవలెనో ఆ ప్రకారము జవాబివ్వవలెను. ఇట్టి జవాబులను మూడు లేక ఇంక ఎక్కువ మారులుగ, ప్రతిపర్యాయము వరుసగ కొంతకొంత భాగము జవాబిచ్చుచు వచ్చి పూర్తిచేయును.

ఇట్టి ధారణ, ఒక్కబుద్ధి బలము విషయమున మాత్రమేకాదు; పంచజ్ఞానేంద్రియములతో కూడ చేసెదరు. చాల గంటలను వేరు వేరు గుర్తులతో వ్రేలాడగట్టి మ్రోగించెదరు. అటుల మ్రోగిన మ్రోతలు విని ఏగంట ఏరీతిని మ్రోగినదో చెప్పవలెను. ఇదే రీతిని తదితర జ్ఞానేంద్రియములను గురించి గూడ పరీక్ష చేసెదరు. ఇట్టి శక్తులు ప్రాణాయామాభ్యాసము వల్ల లభించగలవు.

ప్రాణ మను నదొక సూక్ష్మమైన శక్తి, ఇది స్థూల ప్రపంచములో చలనము, కృత్యముల రూపమునను, సూక్ష్మ ప్రపంచములో సంకల్ప రూపమునను కనిపించును. ప్రాణాయామ మన, ప్రాణశక్తులను నిలువచేసి కొనుట. ఇందువల్ల ప్రాణ