పుట:Pranayamamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వులు గలవు. ఈ రెండు వాయువులు అల్పస్థాయి హెచ్చుస్థాయిలలో పైకి క్రిందికి వీచుచుండును. ఇవి రెండూ మెలకువ యందును, స్వప్నావస్థయందును, స్వప్న రహితమగు నిద్రావస్థయందును ఒకే స్వభావము కలిగి యుండి అంతటను వ్యాపించి యుండును. ఈ వాయువులు రెండింటి సంచారము ననుసరించి నేను నడచుకొనుచూ వాసనల నన్నింటిని నాశనమొనర్చుకొనిన వాడనై, స్వప్నరహిత నిద్రావస్థలో ఏ విధముగ ప్రశాంతుడనై వుందునో, అదే రీతిని జాగ్రదవస్థ యందుకూడ ఏ విధమగు వికారములు లేనివాడనై యున్నాను. ఒక తామర తొడిమను తీసికొనుము. దానిని వెయ్యి భాగములు చేయుము. దానిలో అనగా అంత సూక్ష్మభాగములోకూడ ఈ రెండు వాయువులు అంతకంటె సూక్ష్మరూపములో వుండును. కావున ఇట్టి సూక్ష్మాతి సూక్ష్మముగా వుండు యీ వాయువుల యొక్క తత్వమును గాని. వాటి ప్రవాహములను గురించి గాని తెలిసికొనుట చాల కష్టము. వీటిలో ప్రాణము ఎల్లప్పుడు పైవైపునకు (బయటగాని, లోపలగాని) ప్రవహించు చుండును; అపానము శరీరమునకు బయటను లోపలను క్రిందివైపుకు పోవుచుండును. ఇది వీటి సహజలక్షణము. ప్రాణవాయువు సాధారణముగ 16 అంగుళముల పొడవు బయటకువిడచి, పండ్రెండు అంగుళముల పొడవువరకు లోపలకు పీల్చెదరు. అందుకు మారుగా 16 అంగుళముల గాలిని విడచి, మరల 16 అంగుళముల గాలిని పీల్చు చుండవలెను. ఇది లాభకారి. ఉచ్ఛ్వాసనిశ్వాసల ప్రమాణమును సమాన మొనర్చుకొన గలిగినవాడు బ్రహ్మానందమును అనుభవించగలడు.