పుట:Pranayamamu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగ సాధకుడు క్రమక్రమముగ, శ్రద్ధతో ఎడతెగకుండ సాధన చేసినచో పైన చెప్పిన సిద్ధులన్నియు ఒకదాని తరువాత ఒకటిగ లభించగలవు. ఓర్పులేకుండ సిద్ధులు లభించలేదని విచారపడి మానివేయువానికి ఏ ఫలితములును లభించవు. ఆహారము, బ్రహ్మచర్యముల విషయములలో శ్రద్ధ వహించుము.

మూడవ ప్రకరణము

ప్రాణాయామ మంటే ?

‘తస్మిన్‌సతి శ్వాసప్రశ్వాసయో ర్గతివిచ్ఛేదః ప్రాణాయామః’

“శ్వాసను నియమించుట లేక వశపరచుకొనుట యన ఉచ్ఛ్వాసనిశ్వాసలను ఆపుజేయుట. ఇది ఆసనసిద్ధి కలిగిన పిదప సహజముగ సిద్ధించును.”

ప్రాణాయామమును గురించి పతంజలి యోగసూత్రములలో 2 అ. 49 సూత్రములో ఈ విధముగ వివరించబడి యున్నది.

‘శ్వాస’ యన లోపలికి పీల్చుగాలి, ‘ప్రశ్వాస’ యన బయటకు విడచుగాలి. ఆసనసిద్ధి కలిగిన పిమ్మట ప్రాణాయామమును అభ్యసించవచ్చును. ఒకే ఆసనములో కదలక మెదలక ఒకేసారిగ మూడుగంటలసేపు కూర్చొన గలుగుటయే ఆసనసిద్ధి. అరగంటనుండి గంటవరకు ఒకే ఆసనములో కూర్చొన గలిగినప్పటినుండి ప్రాణాయామము చేయుటను ప్రారంభించ వచ్చును. ప్రాణాయామము చేయకుండ ఆధ్యాత్మిక సాధనలో జయము పొందుట చాల కష్టము.