పుట:Pranayamamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాణముతో పాటు సుషుమ్నలో ప్రవేశించుటచే శిరస్సు (తన ఉన్నతాసనము)ను ప్రాణముతోసహా చేరును. యోగసాధనచే క్రియాశక్తి సిద్ధిని పొంది, షట్చక్రములగుండా మార్గమును ఏర్పరచుకొని కర్మయొక్క త్రివిధఫలములను అప్పుడు చూడ గలుగును. ఆపిమ్మట, అతడు ప్రణవ (ఓం) సహాయముచే కర్మలను రూపుమాపవలెను. అందుచే కాయవ్యూహ సిద్ధిలభించును. ఇందువలన పునర్జన్మ లేకుండుటకై, తన శరీరము నుండి అనేక శరీరములను తన మహిమవల్ల సృష్టించి కర్మలను అన్నింటిని యీ రీతిగా పోగొట్టుకొనిన వాడగును. ఇట్టి స్థితికి వచ్చినవాడు *[1] పంచధారణలను చేసి పంచభూతములను తన వశములోనికి తెచ్చికొనగలుగును.

నిష్పత్త్యవస్థ

ఇది ప్రాణాయామముయొక్క నాల్గవ మెట్టు, యోగి యగువాడు తన కర్మబీజముల నన్నింటిని భస్మమొనర్చుకొని, మరణ రాహిత్యము గలవాడగును. అతనికి ఆకలి, దప్పిక, నిద్ర, స్పృహ దప్పుటలు - ఏమియు వుండవు. అతడు సంపూర్ణముగ స్వతంత్రుడై వుండును. ప్రపంచమునందు ఎచ్చటికైన తాను పోగలుగును. మరల జన్మ లెత్తనక్కరలేదు. అన్ని విధములగు వ్యాధులు, వార్ధక్యము, చావులనుండి విముక్తుడగును. సమాధి ఆనందమును అనుభవించును. ఇట్టి స్థితికి వచ్చినవాడు, ఇక ఏవిధమగు యోగసాధనను చేయనక్కరలేదు. నాలుకను తాలుమూలము వద్దకు పోనిచ్చి ప్రాణవాయువును త్రాగ గలుగును. ప్రాణపానవాయువుల కార్యవిధానమును తెలసి కొనును. ముక్తిని పొందును.

  1. * అనుబంధములో చూడుము.