పుట:Pranayamamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వరూపమే. ఈ ప్రాణశక్తి ప్రాణరూపమున మనస్సుతోనూ, మనస్సువల్ల ఇచ్ఛాశక్తితోనూ, ఇచ్ఛాశక్తివల్ల వ్యక్తిగత ఆత్మతోనూ, వ్యక్తిగతఆత్మవల్ల పరమాత్మతోనూ సంబంధము గలిగి యున్నది. మనస్సుద్వారా చెలరేగుచున్న సాధారణ ప్రాణ తరంగములను వశపరచుకొను విధానమును తెలసికొన్నచో, విశ్వప్రాణమును వశపరచుకొను విధానము సులభముగ తెలియును. ఈ రహస్యమును తెలిసికొనినయోగి ప్రపంచమందలి సర్వశక్తులయొక్క రహస్యమును తెలిసికొన్న వాడగుటచే, ఏ విధమగు శక్తికికూడ భయపడడు. కొంత మంది జీవితములో విజయవంతులు, ఎక్కువ పలుకుబడి గల వారుగనుండుటకు గల రహస్యము, వారికి ప్రాణశక్తిలోబడి యుండుటయే. ఇట్టివన్నియు ప్రాణశక్తివల్లనే లభించగలవు. కాని యిట్టి పలుకుబడి మొదలగునవి గల జనులం దీ శక్తులు వారికి తెలియకుండగనే వుపయోగములోనికి వచ్చుచుండును. కాని యోగియో, వీటిని తన యిచ్ఛానుసార ముపయోగించు కొనగలడు. హృదయ వ్యాకోచము, సంకోచము, రక్తప్రసరణము, శ్వాసోచ్ఛ్వాసలు, ఆహారము జీర్ణమగుట, మల మూత్ర విసర్జనములు, శుక్రము, లాలాజలము, పైత్యరసము, జఠరరసములున్నూ, కనులు మూయుట, తెరచుట, నడచుట, ఆడుట, మాట్లాడుట, యోచించుట, భావించుట మొదలగున వన్నియు ప్రాణశక్తివల్లనే జరుగుచున్నవి.

ఈ ప్రాణము స్థూల సూక్ష్మశరీరములను కలుపు లంకె లాటిది. ఈ లంకెను త్రెంచివేయుటవల్ల సూక్ష్మశరీరము స్థూలశరీరమునుండి విడిపోవును. అదేమరణము. అప్పుడీ భౌతిక శరీరమున పనిచేయుచుండు ప్రాణశక్తి సూక్ష్మశరీరములోనికి తీసికోబడును.