పుట:Pranayamamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలుగుటచే యిట్టివి ప్రారంభస్థితిలో సంభవించును. త్వరలోనే యిట్టిచురుకులు లేకుండపోవును.

ప్ర: ఆధునికశాస్త్ర సిద్ధాంతరీత్యా ప్రాణాపానములు ఎచట కలియును ?

జ: అపానమువల్ల ప్రాణవాయువు తయారు కాదు. అపానము శక్తి. అపానము పొత్తి కడుపునందలి మూలాధార ముండుచోటగు, గుదము, గుదనాళిక యందుండును. ఇది క్రిందికిపోవు స్వభావముగలది. ఇది మూత్రము, వాయువు, మలములను బయటకునెట్టును. కేవల కుంభకము, కుంభకము, మూలబంధము, జాలంధర ఉడ్యాణ బంధములవల్ల ప్రాణాపానములు ఐక్యమగును. ఇవి బొడ్డునందలి మణిపూర చక్రమువద్ద కలియును.

ప్రపంచమందు సంభవించుచుండు అనేకములగు అపాయములకు మూలకారణము అజాగ్రత్తయే. జాగ్రత్తగావున్నచో అనేకములగు అపాయములనుండి సులభముగ తప్పించుకొనవచ్చును. కావున నీవు ఆహారమునందు కట్టుబాటుకలిగి యుండుము. మితిమీరి మెక్కకుము. సులువుగ జీర్ణమగు ఆహారమును తినుము. శక్తికి మించిన సాధనచేయకుము. మొదట ఒకటి రెండు మాసములు పూరక రేచకములను మాత్రమే చేయుము. తరువాత క్రమక్రమముగా పూరక కుంభక రేచకముల నిష్పత్తిని 1 : 4 : 2 నుండి 16 : 64 : 32 వరకు పెంచుచూ రమ్ము. క్రమక్రమముగ నెమ్మదిగ పెంచుచూరమ్ము. ఈ నియమములను జాగ్రత్తగా పాటించినచో ప్రాణాయామ మందుగాని తదితర యోగసాధనలందుగాని నీ కేవిధమగు అపాయమురాదు.