పుట:Pranayamamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచ ధారణలు

పృధ్వి, ఆపస్, అగ్ని, వాయువు, ఆకాశములని ఐదు మూలద్రవ్యములు గలవు. శరీరము యీ ఐదు ద్రవ్యములచే చేయబడినది. పాదములనుండి మోకాళ్ళవరకు పృధ్వీతత్వ ముండుచోటు, ఇది చతుష్కోణాకృతి గలిగి, పసుపువన్నె గలదియై 'ల' ఆనెడి వర్ణముగలిగి వున్నది. ఈ స్థానము పై రోజుకు రెండు గంటలు ధారణ చేయుటచే, పృధ్వీతత్త్వము వశపడును. దీనిని లోబరచుకొనినవానికి పృధ్వీతత్త్వముచే మరణము రాదు.

అంభసి ధారణ

ఆపస్తత్త్వముయొక్క నివాసస్థానము మోకాళ్ళ నుండి గుదము వరకు వున్నది. ఇది అర్ధచంద్రాకృతిని గలిగి, తెలుపు వన్నెగలదై యున్నది. దీని బీజాక్షరము. 'వ'. 'వ'ను స్మరించుచూ ఆపస్తత్త్వ నివాస స్థానమువరకు గాలిని (పీల్చి) గొంపోయి, నాల్గుచేతులు, కిరీటము, పీతాంబరధారియగు నారాయణుని ధ్యానించుచూ, ఆతడునాశరహితుడని భావించు చుండవలెను. ఈ రీతిని ప్రతిదినము రెండు గంటలు ధారణ చేయువాడు, అన్ని పాపములనుండి విముక్తుడగుటయేగాక ఏవిధమగు జలగండము లేని వాడగును.

అగ్ని ధారణ

గుదమునుండి హృదయమువరకు అగ్ని తత్త్వ వాసస్థానము. ఇది త్రికోణాకారముగను, ఎరుపురంగుగను వుండును.