పుట:Pranayamamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలడు. ఇట్టివాడు తన శరీరమును, మనస్సును వశపరచుకొన గలుగుటేగాదు, సృష్టియందలి ప్రతి ప్రాణియొక్క శరీరము, మనస్సులనుకూడ తన వశములోనికి తెచ్చుకొనగలడు. ఇదే ప్రాణాయామము నభ్యసించి, ప్రాణశక్తిని వశపరచుకొనుట వల్ల గలుగు ఫలితము. ఇట్టి యోగి, తన శరీరమునందే జగత్తంతయు నున్నట్లు గుర్తించి, జగత్తునందుగల సర్వశక్తులు తన శరీరమునందున్నవని భావించి, ఆ శక్తుల నన్నింటిని తన వశము చేసికొనుటకు ప్రయత్నించును. ఇట్టి సిద్ధినిపొందుట కొర కాత డనేక రకములగు అభ్యాసముల నొనర్చును.

తెలిసికొంటివా? ఇంక ఆలస్యమెందుకు? ఆలసించుట యన, ఇంకను బాధలను, సంతాపములను అధిక మొనర్చుకొనుటయే, త్వరత్వరగ ఎక్కువ కష్టించి, ఈ ప్రాపంచిక విషయములను వశపరచుకొని సుఖపడుటకు తీవ్ర ప్రయత్నముచేయుము, సరియగు సాధననుచేసి, ఈ జీవితమునందే నీగమ్యస్థానమును చేరుటకు ప్రయత్నించుము, నీవేల ఆ ఆత్మజ్ఞానము, పరమానందము, పరమశాంతి, విశ్వశక్తులను ఇప్పుడే, ఈ జన్మలోనే పొందరాదు?

ఈ సమస్యను యోగశాస్త్ర మొక్కటియే పరిష్కరించ గలదు. దీనియొక్క గమ్యస్థానము సంసార సాగరమునుండి మానవుని దాటించి, శక్తి, జ్ఞానములను పెంపొందింప జేసి, అమృతత్వమును పరమానందములను పొందజేయుటయే.

ఓం శాంతి:

శివానంద

______