పుట:Pranayamamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆహార నియమములేకుండా యోగమును అభ్యసించువాడు, ఫలితమేమియు పొందకపోగా అనేకములగు జబ్బుల పాల్పడును.

6. ఆరు మాసములు లేక ఒక సంవత్సరము వరకు పూర్ణమైన బ్రహ్మచర్య పాలనము చేసినవాడు, ఆధ్యాత్మికముగ అతి త్వరలో వృద్ధిలోనికి వచ్చును. స్త్రీలతో మాట్లాడవద్దు. వారితో పరిహాసము లాడుటగాని, నవ్వుటగాని చేయకుము. వారి సాంగత్యమును పూర్తిగా వదలివేయుము. బ్రహ్మచర్యపాలన, ఆహారమునందు కట్టుబాటు లేకుండా యోగసాధన చేసినచో నీకు పూర్తియైన ఫలితములు లభించవు. ఆరోగ్యమును కాపాడుకొన గోరువారు సామాన్య సాధనలు చేయవచ్చును.

7. క్రమబద్ధముగా నియమిత కాలమందు సాధన చేయుము. ఒక్క రోజుకూడ మానివేయకుము. ఏదైన తీవ్రమైన బాధ నిన్ను బాధించునప్పుడు సాధన మానివేయుము. కొందరు కుంభకమును చేయునప్పుడు ముఖస్నాయువులను బిగలాగుదురు. అటుల చేయరాదు. ఇటుల చేయుట వారి శక్తికి మించిన సాధన చేయుచున్నారని అనుకొనుటకు సూచకము. ఇట్టి అలవాటు గలవారు రేచక పూరకములను సక్రమముగా చేయలేరు.

8. పగటినిద్ర, రాత్రులం దెక్కువసేపు మేల్కొని వుండుట, మలమూత్రములు అత్యధికముగా వుండుట, అనారోగ్యమును కలిగించు ఆహారము, ప్రాణశక్తి అపరిమితముగా వ్యర్థమగు మానసిక పరిశ్రమలు యోగ విఘ్న కారులు. కొందరు ఏదైన కారణముచే ఏదైన వ్యాధి వచ్చినచో, అది యోగ సాధనవల్ల వచ్చినదని తలచెదరు. ఇది తప్పు.