పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిని, వివాహ మయినతోడ్తో మద్రాసు వచ్చి వేసితిని. అప్పుడు నానివాసము మైలాపూరులో. తిరివల్లి క్కేణి హైస్కూలుకు ప్రతిదినము రాకపోకలు. తొమ్మిది గంటలకు హోటలులో భోజనము చేసి తిర్వలిక్కేణికి నడచి వెళ్ళి సాయంకాలము తిరిగి నడచి వచ్చి రాత్రి భిజనము చేయుట. దీనిచే నాహారము చాలక కాఁబోలును నీరసముగానే ఉండెడివాడను. నీరసమే తప్ప వ్యాధి యేదియును లేదు. అప్పుడప్పుడు కృష్ణా మండలమందలి స్వగ్రామమునకు వెళ్ళి అక్కడ కమ్మని నెయ్యి పెరుగులతోడి భోజనము చేసినప్పుడు శరీరమునకు మంచి బలోత్సాహములు లభించుచుండెడివి! సంవత్సరమున కొకతూరి తప్పకుండ నింటికి వెళ్లుచు నట్టిబలోత్సాహముల నార్జించుకొని వచ్చి వానినిమద్రాసులో వ్యయించుచుండినట్టు తోచుచుండెడిది. ఈ ప్రయోజనముకై వివాహానంతరాము వేసంగిలో నేనింటికి వెళ్ళితిని.

--- ---