పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లయ్యెనో తామే భరించిరి. ఇట్లు జరగుటకు గూడ బాల్యమున నాలోఁ గుదుర్కొన్న యవ్యక్తభావమే కారణము.

భూమిలోఁ బడవేసినవిత్తనము కొంతదాఁక ఏమయినదియుఁ దెలియరాక యుండి యుచితకాలమున నంకురరూపముగా బహిర్వికాసము చెందినట్లు మానవహృదయములలోఁ జొచ్చు కొని పోయినయనుభూతులు కూడ నుచితకాలమున వానికిఁ దగినట్లు పాకముతో వెల్వడి విరివిసెందును. కాని యివి బీజరూపముగా నెన్నడో లోనికిఁ జొచ్చుకొని పోయిన యాయనుభూతులవల్ల నేర్పడినవేయని గుర్తించుట మాత్రము సర్వత్ర జరుగదు. లోతయినసంస్కారములు కొన్ని కాల మెంతో గడచి యనుకూలసందర్భము సమకూడి నప్పుడు గాని కార్యపరిణామము సెందఁజాలవు. ఆ చెందిన కార్యపరిణామమునాఁటికి కారణజ్ఞప్తి మఱుగుపడి పోవుట సంభవింపవచ్చును. ఈ బీజరూప సంస్కారములు లోసొచ్చుటయుఁ దర్వాత నవి బహిర్వికాసము సెందుటయు నొక్క జన్మములోనే జరగు ననఁ గాదు. పూర్వక్షణపు బీజరూపసంస్కార ముత్తరక్షణముననే బహిర్వికాసము చెందునది గాఁ గొన్ని సందర్భములం దుండవచ్చును. కొన్ని సందర్భములం దేడుజన్మముల దాఁకఁ గూడఁ దేలనిది గావచ్చును. భగవత్ర్పాప్త్యర్దమైన సంకల్పబీజములు భగవత్తత్త్వమును గూర్చి స్పష్టపరిజ్ఞానము కుదురుదాఁక విరివి సెందుచుఁ బెరిగి పెరిగి పరమ్యము పొందినపిదప నక్కడనుండి బహిర్వికాసము