పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గా రప్పుడప్పుడు మా గ్రామమునకు విచ్చేయు చుండువారు. ఎడ్వర్డు పట్టాభిషేకము జరగినపుడు నే నేవో సంస్కృత శ్లోకములు రచించితిని. వారు విచ్చేసి నా రచన వినినన్నుఁబ్రేమించిరి. వారు విజయనగరమున భీమాచార్యులుగా రను తర్క విద్వాంసు లకడ సంగమేస్వర శాస్త్రిగారితోఁ గలసి పెక్కేండ్లు తర్క శాస్త్రము నభ్యసించి తొలుత మా గ్రామమున నెలకొనఁ గా నేదో తీవ్రానారోగ్యము కలుగఁ గా మా నాయనగారు వారి కౌషధ మిచ్చి వ్యాధి కుదిర్చిరఁట! తరివాత వారు చల్లపల్లి చేరిరి. ఆ యనుబంధమున వారు మా యింటికి విచ్చేయుచుండువారు. వారిదగ్గఱఁ జదువుకొనుటకు నేను చల్లపిల్లి చేరితిని. లఘుకౌముది చదువ నారంభించితిని. కాని వారు పాతంజల యోగసూత్రములను గూడఁ జెప్పిరి. అందుఁ జదివిన విషయములు నాలోఁ జొచ్చుకొని పోయి వింత యోచనలఁ గొల్ప సాగినవి. వారు తెల్లవారుజమున నిద్రలేచి రాత్రి పండ్రెండు గంటల దాకఁ ననుష్టానముతో తపోమయులుగా విరాజిల్లుచుండెడివారు. విద్యార్ధుల మగు మమ్ము గూడ నట్లు చక్కదిద్దఁజూచుచుండెడివారు. కర్మానుష్టానములమీద నా కేటికో శ్రద్ధ కలుగకపోయెను. బందరులో శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రులు గారు హిందూ హైస్కూలులో తెలుఁగు పండితులుగా నప్పు డుండిరి.

ఇంటివాకిటఁ గూర్చుండి నేను పాఠము చదువుకొను చుంటిని. లోపల ఇల్లూడ్చుట జరుగుచుండెను. ఆదుమ్ము వాకిటికి వచ్చుచు నా మీదను సోకుచున్నది.' సమ్మార్జనీ రజ