పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యెడ శ్రద్ధ గలవారు స్వయము వాని నభ్యసించి నిర్వర్తించు కోగలరు. అట్టివారు స్వయము పరమార్ధబుద్ధితో నాచరించుచుండువారినే పురోహితులను వరింపఁ గలరు. పురోహితత వంశాచారముగా వచ్చుచుండుట చేనం దెన్నో భ్రంశములు చేరినవి, బ్రాహ్మణులలో వేయింటి కోక్కరయినను సరిగా నగ్నిహోత్రముల నంచుకొనువారు నేఁ డు లేరు. శ్రౌతసంప్రదాయమే యుత్సన్న ప్రాయ మైనది. ఉపనయనమునాఁడు, వివాహమునాఁడు మాత్రము చేయునగ్ని కార్యము, దానిని సరిగాఁ జేయనందుకుఁ బ్రాయశ్చిత్తములు, హోమములు పురోహితును వింత పాటలు నటలు నయిపోయినవి, కాళిదాసు నాటకములందు విదూషకుఁ డెట్టి పూజ్యత బొందినాఁడో నేఁడు వివాహోపనయనాది కర్మలందు పురోహితుఁ డు నట్టి పూజ్యతనే పొందుచున్నాఁడు." అశ్రద్ధపితాళ్ళకు ఆకతాయి తర్పణ' మన్నట్టు ఆశ్రద్ధదానుఁ డయిన గృహస్థుకుఁ దగినట్టే యవాకుల పురోహితు లేర్పడినారు. కనుక నీయవహేళిత వృత్తిలో ప్రవర్తింపరాదని, సంభావనలకు, భిక్షములకు నేనిది నేర్చితి నది నేర్చితి నని యాచనలకుఁ బోరాదని పసినాఁటనే నేను నిర్ణయించు కొంటిని.

నా కుపనయన మయినది. సంధ్యావందనాదికము నిర్దుష్టముగా నేర్చుకొంటిని. సంధ్యాభాష్యము చదివి యర్ధము తెలిసికొంటిని. ఇంటిదగ్గఱనున్నచో నిక వైదిక వృత్తికిఁ జోరపడవలసి వచ్చెడి దేమో కాని ఈశ్వరుఁ డను గ్రహించెను. చల్లపల్లి విద్వాంసులు, మహర్షి కల్పులు శ్రీ అద్దేపల్లి సోమనాధశాస్త్రులు