4
ప్రజ్ఞాప్రభాకరము
మున మంచి సాహిత్యమును కొంచెము కవితా పరిజ్ఞానమును గలవారు. వైద్య విద్యా విశారదులు. పారంపర్యముగా పురోహితత జీవిక యయినను మా తండ్రిగారు ప్రధానజీవిక వైద్యముగా వర్దిల్లిరి. మా తల్లిదండ్రులు పరస్పరము ప్రేమమయులు. వివాహ మయిన తర్వాత వారెన్నడు భిన్నస్ధలములలో నెక్కువ నాళ్లు వసించి యెఱుగరట!
దంపతులు గాఢానురక్తులగుచో, సత్సంకల్పులగుచో, రసభావానందమయు లగుచో తత్సంతానము చిరంజీవిత్వాది గుణగణ్యమై వెలయఁగల దని ఇటీవలి నా గట్టి యెఱుక. ఇందు కెన్నో తార్కాణ లెఱుగుదును.
మా తల్లిదండ్రుల ప్రగాఢనురాగము తత్సంతాన మగు మా కింత దాఁక క్షేమారోగ్యదికము ప్రసాదించిన దని నా విశ్వాసము. మాతండ్రిగా రెనుబదిమూఁడేండ్లు నిరామయ దీర్ఘజీవితము గడిపిరి. వారి తండ్రిగారును నెనుబదిమూఁడేండ్లు జీవించిరి. మా తాతగా రవసానకాలమున కుమారుని బిలిచి "నాయనా! నీవును నావలె నెనుబదిమూఁడేండ్లు జీవించగల" వని మా తండ్రిగారి నాశీర్వదించి రట! పలుమారులు మా నాయనగా రీ యాశీర్వాదమును జెప్పుకొనుచుండెడివారు. వారి యాశీర్వాదము మా తండ్రిగారియెడ ఫలించినది! మా తల్లిదండ్రులు సంపన్నులు కారు గాని సంపన్నుల కంటె సుఖముగా జీవిక గడపిన వారు. పుత్రపౌత్రాదులతో మా యూర మాయిల్లు దోసతోటవలె నుండెడిది. మా యింట మా నాయనగారు నూఱింటిదాక జన్మోత్సవములు వారి కాలమున జరపినట్లు లెక్కించుచుండెడివారు.