పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూజ, భజన, హారతి మొదలగు బాహ్యచిహ్నము లేవియు వీరు వల దందురు. వీరిని తలఁచి నమస్కరించి నచో శరీరములో యోగక్రియ ఆరంభ మగును. సాధకుని వంతు సాక్షి మాత్రముగ తనలో జరుగుమార్పులను గమనించుటయే. ముద్రలు గాని, ఆసనములుగాని, ప్రాణాయామముగాని, హఠయోగాభ్యాసముగాని అక్కఱ లేదు. వానిని నిషేధింతురు గూడ! అభ్యాసకాలమున ప్రజ్ఞ సాధకుని స్వాధీనములోనే యుండును.

   ఆహారవిషయమున కఠిననియమము లేవియు లేవు శరీరమునకు చల్లదనమును, పుష్టిని కల్గించు సాత్త్వి కాహారము తిసికోనవలెను. సాధనకై ఇల్లు వాకిలి వదల రాదు. సన్యాసము పనికి రాదు. ఎవరివృత్తి వారు సాగించుచునే సాధన చేయవలెను. సాధకులు తమ్మితరులు గుఱతించుటకై ఎట్టి యార్భాటమును ప్రకటింపరాదు. ఈ సాధన వలన అనేక మహత్తులు లభించును వీని నెన్నఁ డును దుర్వినియోగము చేయరాదు. మఱియు అవి ప్రధానములును గావు. ఈ యోగగౌరవమునకు తగినట్లు సాధకులు తమ ప్రవర్తనను నీతి మార్గమున నడపించుకొనవలెను.
ఇంకను ఈ యోగమును గూర్చి వ్రాయఁదగిన దెంతయో కలదు గాని ప్రస్తుతమున కింత యే చాలు నని విర మించుచున్నాను.
   గుంటూరు 
     ఖర                                                            కొత్త వెంకటేశ్వరరావు . 
   శ్రావణ బహుళ విదియ