పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[3]

  శ్రీ శాస్త్రిగారి ప్రజ్ఞ బహుముఖముల ప్రసంరించినది. వారి వ్యక్తిత్వమును క్రొత్తవారికి పరిచయపఱచ గోరెడు రచన కెంతయో నేర్పు గావలెను. మరియు గ్రంథమా పెరుగును. అందుచే నేనిట కొన్ని కొన్ని పట్టులను స్పృశించి వదలెదను.
   కల్పనాసాహిత్యమును గూర్చి వారి యభిప్రాయము విశిష్ట మైనది. అట్టి గ్రంథములందు మనము చూచునది అసత్యమే! అసత్యపఠనలో కాలము వ్యయింప నేల? కవి ద్రష్టయైన గాని జీవితసమస్యల లోఁతు తెలియనేరఁడు. ద్రష్ట కాని వాని రచనలు కొలఁదిలోతున నూరెడిజలమువలె దుష్టములు.-నిజమైన కవిత్వమునకు శబ్దార్ధాలంకారముల యాడంబరముల పని లేదు. ద్రష్ట యైనవాని రచనలందు వస్తుగౌరవమునుబట్టి అన్ని యలంకారములు నందు స్వతస్సిద్ధముగ నేర్పడును. ఇందులకు గాంధీజీ రచనలే సాక్షి. మానవవిజ్ఞానకళ్యాణములను గూర్చు శాస్త్రవిషయగ్రంథములు పఠనీయములు.
   మరియు నిత్యజీవితములోని యనేక యథార్ధ సంఘటనలు కవితావస్తువుగ స్వీకరించి, కరుణరసప్రధానముగా నీతిప్రబోధకములుగా అలఁతి యలఁతి మాటల కూర్పుతో సుందరముగ రచింపనగు నని వీరు తలఁచెడివారు. ఆరీతిని వారు కడుపుతీపు, విశ్వాసము, కపోతకధ, మున్నాళ్లముచ్చట మొదలగు చిన్ని ఖండకావ్యములను రచించిరి.