పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాఁడు జీవించునో లేదో గుర్తించుటకు ధ్రువనాడీకారున కత్యధిక ధన మిచ్చి యింటికి రప్పించి గ్రంథము నక్కడే యుంచి చదివించుచుండిరి. ఆ కుఱ్ఱవాని జాతకము సరిగానే యందుఁ గలదు. ఆతని యనారోగ్యపు నిర్వచన మెల్ల సరిగానే యందుఁ గలదు. ఆ జాతకపు టాకు తుదిపట్టు చదువుచుండిరి. అంతలో ఆపరేష౯ చేయుటకు డాక్టరు రంగాచార్యులు గారు విచ్చేసిరి. ఆ సమయమునకు సరిగా 'శస్త్ర వైద్యేన జీవతి' యన్న వాక్యము నాడిలో వచ్చెను. తరువాతి యాకు నిఁక చదువవలెను. డాక్టరుగారు వచ్చుటచే నంతట నాపిరి. అందఱకును ఆ కుఱ్ఱవాఁడు శస్త్రవైద్యముచే జీవించును అనియే యర్థము స్ఫురించెను. డాక్టరు శస్ర్తోప క్రమమునకు సిద్దపడుచుండెను. నాడీగ్రంథమునఁ జదువుచున్న పట్టున గుర్తించి కట్టిపెట్టి గృహస్వామి యినుప పెట్టెలో తాళము వేసి తాళముచెవి నాడికారున కిచ్చెను. మర్నాడు వచ్చి కడమ గ్రంథమును జదువుట కేర్పాటు జరగెను. తొందరగా నాడీకారుఁడు శేషాచార్యుఁ డింటికి వచ్చివేసెను. ఈ విషయ మెల్ల మాతోను జెప్పెను. మేమును నాతఁడు జీవించు ననియే యనుకొంటిమి.

మర్నాడు శేషాచార్యుఁ డుదయమున వారింటికి వెళ్ళెను. ఆపరేష౯ జరుగుచుండఁగానే ఆ బాలుఁడు మృతుఁ డౌట తెలియవచ్చెను. అక్కడి పండితులు నివ్వెఱ చెందుచుండిరి. ఈతనిని నాడీ తెఱవు మనిరి. తెఱవఁగా నా జాతకమున తుదిశ్లోక మదియే. తర్వాతి యాకులో వేఱొక