పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరతత్వము అస్తి యని స్పష్టముగా ననుభవింప నగు చున్నట్లున్నదే? దీని లోఁ తేదో తెలిసికొనవలెను గదా! త్రోవ దొరకినది గదా! నా ప్రార్ధనమును లోన నెవరో వినుచున్నట్టు_ సమాధానము చెప్పుచున్నట్టు_అనుగ్రహించు చున్నట్టు అగుచున్న దేమి వింత? నా జబ్బు నాకు చాలా ఉపకారమే చేసెనా యేమి! ఇక నా జబ్బు కుదిరినట్టే తోఁచు చున్నదే! ఏమి యానందము! ఏమియు లేకున్నచో నాచేయి యింత వాచుటేమి? నావశము తప్పి చేతులు లేచి నమస్కరించు టేమి? చే కూడుట యేమి? 'చేకూడుట' అన్నపదము కల్పించినవా రెవరు? ఈ రెండు చేతులు లేచి కలసి నమస్కరించుటను సూచించునదిగా నేర్పడినదా యేమి చేకూడు, కైకూడు పదకల్పనము? నే నారోగ్యవంతుఁడ నగుచో మా వారెంత సంతోషింతురు! మావారి నందఱను నిందుఁ జేర్పఁ గల్లుదునా యేమి? ఇత్యాది భావము లాధ్యానసమయమున మెఱపులు మెఱసినట్లు నాలోఁ జెలరేగ సాగెను. ఆనాఁటిస్థితి నా కొక జన్మ మబ్బిన ట్టుండెను. ధ్యానావసాన సమయమున నాయుత్సాహ మక్కడి మిత్రులకుఁ దెలిపితిని. అక్కడివారు వారి వారి యనుభూతి విశేషములఁ గొన్నింటిఁ జెప్పిరి.

--- ---