పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పటివఱకు ఆ వధువు నాకు ధర్మ పత్నిగా నాతో సంసారయాత్ర సాగింప నున్నది సుమా యన్న తలఁపే కాని యంత కెక్కువ యోచనలు లేవు. ఇఁకమిఁద నా వధువు మా యింటికి రానున్న దని, వివాహ ప్రయోజన మిఁక మీదనే అనుభవింప నంటిమని, నాహృదయము నే నెఱుఁ గుదు ననుకొనుచుంటిని గాన ,ఆమె హృదయము నాకర్పించి నా హృదయమున నప్పన గొనుటో, తన హృదయమును నా కర్పింపక నాహృదయమును హరించుటో యేదిచేయునోయనీ, అంత దాఁక నన్నత్యంతము ప్రేమించుచున్న మా తలిదండ్రుల కాపిల్ల ప్రేమ పాత్ర మగునో కాదో అనీ, ఆ పిల్ల వారి నెంత యేడ్పించునో అనీ, నా యన్నదమ్ములకు, అక్క చెల్లెండ్రుకు, నాకుఁగాల సౌమన స్య మిఁక ముందేమి కానున్నదో కదా అనీ వెఱపు. క్షణక్షణమునకు స్పష్టాతి స్పష్టముగా విచారము పెరుగ సాగెను. మఱియు మా తలిదండ్రుల చాటుననే యంతదాఁక నా జీవితము సాగుచుండెను. సర్వభారము వారు మోయుచుండఁగా నిర్భయుఁడనై నే నుంటిని. నా దృష్టిని వారు వ్రాలి య స్తమింపబోవుచున్నట్టును, నే నొక వంశవృక్షమును వెలయించి యుచ్చస్థాన మాక్రమింప బోవు చున్నట్టును దోచ సాగెను. నే నంత నిర్వహింప గల్గుదునా? మా తలిదండ్రులు న్నంత దాఁ క వారి చాటువాఁడ నగుటే శ్రేయము గాదా? నేను వెలయింపఁ బోవు వంశవృక్షముతో మా తలిదండ్రులు వేలయించిన వంశవృక్షముతో పొంది పోసఁగి లోబడి యుండ వలదా? ఏమగునో? నా జీవిత