పుట:Prabodhanandam Natikalu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పగా, కొందరు ముస్లీమ్‌లు ఆ మాటలను అపార్థము చేసుకొన్నట్లు తెలియుచున్నది. ప్రవక్త దేవునివైపు ముస్లీమ్‌లను నడుపాలనుకోగా, ఆయన మాటలను అర్థము చేసుకోలేక కొందరు ముస్లీమ్‌లు సైతాన్‌ (మాయ) వైపు పోవుచున్నారు. ప్రళయములో ప్రతి మనిషిని సమాధినుండి దేవుడు లేపుతాడని, వాని పాపపుణ్యములను విచారించి స్వర్గ నరకములకు పంపుతాడని, అల్లా లేపినపుడు లేపబడిన వాని శరీరము మీద ఒక నూలు పోగు కూడ ఉండదని, అప్పుడు ఏ గుణ భావములుండవని ప్రవక్త చెప్పగా, ఆ మాటలలో ప్రళయము అంటే ఏ ప్రళయమో, ఏ ముస్లీమ్‌కూ అర్థము కాలేదు. సమాధి అంటే సమాధి ఏదో అర్థము చేసుకోలేదు. ప్రతి మనిషిని లేపి విచారిస్తాడనగా ఎలా లేపుతాడో, ఎలా విచారిస్తాడో ఎవరూ అర్థము చేసుకోలేదు. స్వర్గ నరకములకు పంపుతాడనగా ఎక్కడకు పంపుతాడో స్వర్గ నరకములు ఎంత దూరమున్నాయో ఎవరికీ అర్థము కాలేదు. శరీరము మీద నూలుపోగు కూడ ఉండదని ప్రవక్త చెప్పగా, నూలుపోగు ఎందు కుండదో ఎవరూ యోచించలేదు. సమాధినుండి లేపినపుడు ఏ గుణములు ఉండవు, ఏ యోచనలుండవు అని ప్రవక్త చెప్పిన మాటలలోని అంతర్యమును ఎవరూ గ్రహించలేదు. ప్రవక్త చెప్పినది దొంగనైన నాకు బాగా అర్థమైనది. ప్రవక్త చెప్పిన మాటలు ఎవరూ ఖండించలేనివి. ఎంతో సత్యమైనవి. కానీ వాటిని చాలామంది అపార్థము చేసుకొన్నారు. దీనినిబట్టి చూస్తే ప్రవక్త చెప్పిన గొప్ప రహస్యమును ప్రజలు అందుకోలేక పోయారని తెలియుచున్నది.

ముస్లీమ్‌  :- ప్రవక్త చెప్పింది మాకు అర్థము కానిది నీకర్థమైందా? ప్రవక్త చెప్పింది మాకు ఏమి అర్థము కాలేదో ఒక్క దానిని చెప్పు.

దొంగ  :- అట్ల అడిగితే ఫరవాలేదు. ప్రశ్నించినపుడే ఏదైన అర్థమయ్యేది. సరే నేను ఒకమాట అడుగుచున్నాను. నామాటకు సమాధానము సరిగ చెప్పితే, ప్రవక్త మాట నీకు అర్థమైనట్లే, లేకపోతే అర్థము కానట్లే.