పుట:Prabodhanandam Natikalu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాజేస్తున్నారు. ఎన్నో ఆలయాలలో నగలు, కిరీటాలు, హూండీలో డబ్బులు మాయం చేస్తున్నారు. కొన్ని ఆలయాలలో విగ్రహలనే దొంగిలించి విదేశాలలో అమ్ముకుంటున్నారు. అందుకే నా పరువు పోకూడదని, నా ఆస్తి అయిన పాదరక్షకులు, కమండలము, యోగదండము, నా వాహనమైన నందిని కాపాడుకోవడానికి సగం కన్నులతో చూస్తూ, అప్పుడప్పుడు యోగబ్రష్టుడనై దైవత్వమును చేరుకోలేక నానాపాట్లు పడుతున్నాను.

నిలువునామం :- చూసావా, చూసావా నీ శంకరుడే దేవున్ని కాను అని ఆయన స్వయాన చెబుతున్నాడు. ఇపుడైన తెలిసిందా నా నారాయణుడే నిజమైన దేవుడు. అందుకే విభూతి రేఖలు తీసి, నిలువునామము ధరించి మా సమాజంలో కలుసుకో...

బ్రహ్మ :- ఓరీ! నీచ మానవులార! ఏమీ మీ ప్రేలాపన? మా దగ్గరకు వచ్చినా మీ బుద్ధులు మారలేదే? భయం, భక్తి లేకుండా మాట్లాడుచున్నారు. రాజకీయపార్టీల్లా వేషాలు, ఆచరణలు మారమంటున్నారు. మీకున్న భక్తి మీ స్వార్థంకోసమే కాని జ్ఞానం, ధర్మముకోసం కాదురా! పొండి. ఇక్కడ నుండి పొండి లేకుంటే నేను ఏమి చేస్తానో.

నిలువునామం :- నారాయణ! నారాయణ! నీవే కాపాడు. బ్రహ్మగారు మా మీదకు కోపంగా వస్తున్నారు. మీరే మమ్ములను కాపాడండి. నీహుండీలో ఎంతో డబ్బువేశాను, నావి నా కుటుంబ సభ్యులందరి తలనీలాలు సమర్పించినాము. నీ పుణ్యక్షేత్రములు అన్ని తిరిగాను, నన్ను కాపాడు స్వామీ.

విష్ణు :- ఏమిరా! పుణ్యక్షేత్రములు తిరిగావా? అంటే స్థలాలు ఎక్కడైన పుణ్యము చేసినవి, పాపము చేసినవి ఉంటాయా? మనిషే పాపాలు, పుణ్యాలు చేస్తుంటాడు. నీవు తిరిగినవన్నీ దేవాతాప్రాంగణాలు, నిజమైన దేవుని