పుట:Prabodhanandam Natikalu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వయంవరమునకు ఆహ్వానించబడిన వారందరు భారతదేశములోని చిన్న చిన్న సామంతరాజులు. అటువంటి సామంతరాజులు వచ్చిన స్థలమునకు లంకేశ్వరుడైన నేను, లంకాద్వీపమునకు చక్రవర్తినైన నేను పోగలనా? అప్పటికే మండోదరి అను భార్యాసమేతుడనై, ఇంద్రజిత్‌ అను వివాహమైన కుమారయుతుడనై, వయస్సు పైబడిన నేను కూతురుతో సమానమైన, కూతురువయస్సున సీత స్వయంవరమునకు పోగలనా? పోయాననుట అసత్యము. అంతకుముందే కైలాసపర్వతమును శివునితో సహా ఎత్తిన నేను, సీతాదేవి ఎత్తిన ఒక ధనస్సును ఎత్తలేనా? స్వయంవరములో సీత ఎత్తిన ధనస్సును ఎత్తలేని వాడిని, అడవిలో సీతను మట్టిగడ్డతో సహా ఎలా ఎత్తుకు పోయాను? సీతను ఎత్తగలిన బలముకల నేను సీత ఎత్తిన ఒక వస్తువును ఎత్తలేనా? సీతను ఎత్తుకు పోయినమాట వాస్తవమేగానీ ధనస్సును గురించి కవులు అల్లిన సమాచారమంతా కల్పితము.


రావణునికి పది తలలున్నాయనుట పూర్తి అసత్యము. నాకు పది తలలు లేవు. కానీ పది తలలకున్నంత తెలివి, జ్ఞానముగలవాడిని కనుక ఆనాడు నన్ను దశకంఠుడు అన్నారు. సూక్ష్మముగ దశకంఠుడనే కానీ భౌతికముగ అందరికున్నట్లు ఒక్క తలమాత్రమున్నది. కనిపిస్తున్న ఒక్క తలను వదలి రామునికి ఒకటి, రావణునికి పది అనుట అవివేకము కాదా!... రావణ అను గంభీరమైన నామధేయముకల్గిన నన్ను అసురుడని నాలోలేని అసురత్వము కనిపించునట్లు రావణాసురుడనుట భావ్యమా!...


పదినెలలు పర్యంతము నా ఆధీనములోనున్న సీతాదేవికి ఎటువంటి అసౌకర్యము లేకుండునట్లు, ఒంటరితనము తోచనట్లు, పదిమంది స్త్రీలను ఆమె సేవకు వినియోగించాను. రావణుడు నన్ను అసభ్యముగ మాట్లాడాడని గానీ, అట్లు ప్రవర్తించాడనిగానీ, సీతాదేవి ఎవరితోనూ నన్ను గురించి