పుట:Prabodhanandam Natikalu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడ్డనామం :- ఒరేయ్‌! నిలువునామము పొద్దుపోద్దునే నీ దరిద్రపు ముఖం కనిపించిందేంట్ర. ఈరోజు నా గతి ఎలా ఉంటుందో; ఏమో!

నిలువునామం :- నిత్యం అష్టాక్షరి మంత్ర నామస్మరణతో నారాయణుని మెప్పించిన గొప్ప భక్తులము మేమే! మమ్ములను నీవు అవహేళన చేస్తావా అప్రాచ్యుడా!

అడ్డనామం :- మీ అష్టాక్షరికంటే ముందు పుట్టిన పంచాక్షరి మంత్రమునే జపించిన ఆదిపీఠవారసులము. పంచాక్షరి మంత్రముతో పరమశివుణ్ణే మెప్పించగల మమ్ములను ఆక్షేపిస్తున్నావురా! నిలువు నామమా!

నిలువునామం :- దశావతారాలలో సృష్ఠిని కాపాడిన నా విష్ణుమూర్తియే నిజమైన దేవుడు. ముందు ఆ విషయమును తెలుసుకో!

అడ్డనామం :- ఆ..ఆ... శివుడాజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు తెలుసా? అంటే అన్ని కార్యములకు శివుడే కారకుడు, ఆయనకు తెలియనిదంటూ ఏమీలేదు. అంతేకాకుండ, లోక క్షేమంకోసం విషమును తన గొంతులో దాచుకొని, ఈ లోకములోని జీవరాసులన్నిటినీ కాపాడాడు. లేకుంటే నీతాత, నీముత్తాత అందరూ ఆదిలోనే లేకుండాపోయి ఈ రోజు నీవుకూడా లేకుండా పోయేవాడివి, అటువంటి శివుని గూర్చి తెలుసుకొని నీవుకూడ అడ్డనామములు ధరించుకో! అన్ని కోర్కెలు తీర్చగల సమర్థుడు మా శివుడే అందుకే నిలువునామమును తీసేయ్‌.. తీసేయ్‌....

నిలువునామము :- ముందు నీవు మూసేయ్‌... మూసేయ్‌ అన్ని కోర్కెలూ తీర్చగల సమర్థుడు నా విష్ణువే, లోకరక్షకుడు కూడా నా విష్ణువే. పూర్వము భస్మాసురుడు తపస్సు చేసినపుడు ప్రత్యక్షమైన నీ శివుడు, ఆయన కోర్కెను తీర్చి ప్రాణాలమీదికి తెచ్చుకున్నపుడు, నా నారాయణుడే మోహిని అవతారందాల్చి నీ శివుడ్ని కాపాడాడు, జరిగిన విషయం తెలుసుకొని మాట్లాడు.