పుట:Prabodhanandam Natikalu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తనకే తెలియని మానవులు, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము తెలియని మానవులు, శ్రీరాముణ్ణి మంచివాడనిన, రావణబ్రహ్మను చెడ్డవాడనిన, తెలివిలో తేజస్సున్నవారు ఎవరు నమ్మరు. అయినప్పటికి నీవు ప్రత్యేకించి అడిగావు కావున అజ్ఞాన అంధకారములో చిక్కుకొని చదువులుండి సంస్కారములేనివారు, భక్తియుండి భావములేనివారు, సన్యాసముండి సాక్షిని తెలియనివారు, ఆచారములుండి అర్థము తెలియని మనుషులు తెలియునట్లు, ఆలోచించునట్లు నేను చెప్పవలసిందే! ఈ ప్రజలు వినవలసిందే.


సీత స్వయంవరమునకు నేను పోయి శివధనస్సును ఎత్తలేక భంగపడినానా? సీత స్వయంవరము భారతదేశములో జరుగుచుండగ, లంకలోని నాకెట్లు తెలిసింది? ఎవరైన సముద్రమును దాటివచ్చి నన్ను ఆహ్వానించారా? అప్పటి కాలములో సముద్రమును దాటుటకు ఏ సదుపాయములు లేవే! అంతకుముందు ఎవరూ దాటని సముద్రమును సీత అన్వేషణకు హనుమంతుడు మాత్రము ఎగిరి దాటినాడని చెప్పినపుడు, రవాణాసౌకర్యములేని ఆ దినములలో ఎవరూ లంకలోనికి రానట్లే కదా! సీత స్వయంవరమును గురించి తెలుపనట్లే కదా! స్వయంవర విషయము నాకు తెలియకున్నను, తెలిసినట్లు వర్ణించి, నేను అక్కడికి పోకున్నను పోయినట్లు చిత్రించి, చివరకు శివధనస్సును ఎత్తకున్నను ఎత్తలేని నిర్భలునిగ రూపొందించి, రావణుడు చెడ్డవాడన్నట్లు చేశారు. ఈ విషయమును వ్రాసినది ఆనాటికవులు. ఆనాటి కవులు ప్రాంతీయ అభిమానముతో వారు ఆర్యులని, మేము ద్రావిడులమని, ద్రావిడులను రాక్షసులుగ, ఆర్యులను దేవతలుగ చిత్రించి చెప్పిన చరిత్రే రామాయణము. రామాయణములో నన్ను రాక్షసుడని రాముణ్ణి దేవుడని అన్నారు. నేను ఎలా రాక్షసుణ్ణో, రాముడు ఎలా దేవుడో యోచించవలసిన బాధ్యత మీదే.