పుట:Prabodhanandam Natikalu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్ణయ్య :- ఓరి నీదుంప తెంచ! పిట్టకొంచెం కూత ఘనం అన్నట్లు ఎట్లాంటి చిక్కుపాయింట్లు ఏరిపెట్టుకొన్నావురా. ఇదికూడ నీవు చెప్పినట్లు వాస్తవానికి దూరంగా ద్వంద్వ వైఖరిలో ఉంది. ఆలోచించి చూడగా పురాణాలలో అక్కడక్కడ ఇలాంటి అసత్య విషయాలున్నట్లు నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది.

వేణు :- అప్పుడే ఏమైంది తాతారావుగారూ! ముందుంది ముసళ్ళపండుగ, ఇంకో పాయంటడుగుతాను చెప్పండి. వామన పురాణములో వామనుడు బలిచక్రవర్తిని మూడడుగుల భూమిని దానంగా యాచించాడు ఆయన ఇచ్చాడు. మరి వామనమూర్తి, ఆ దానమిచ్చిన భూమిని ఎలా పుచ్చు కున్నానడో వివరిస్తారా!

పూర్ణయ్య :- ఏముంది నాయనా? ఆ వటుడు ఆకాశానికి పెరిగి ఒక పాదంతో భూగోళానంత కొల్చి ఆక్రమించుకొన్నాడు. రెండవపాదం అంబర వీధినంతయు కొల్చుకొన్నాడు.

వేణు :- మూడవపాదంతో ఏమి కొల్చుకొన్నాడు.

పూర్ణయ్య :- అదే చెప్పుతున్నాను విను నాయనా! మూడవపాదం కొల్చుకొనుటకు ఏమి లేనందున, ఆ సంగతి బలిచక్రవర్తిని అడిగితే నా తల మీద పెట్టమన్నాడట, అలానే చేసి ఆయన్ని పాతాళానికి త్రొక్కేశాడంట.

వేణు :- ఆ! ఆగు తాతయ్యా ఆగు. ఒకటవపాదంతో భూమినంతా కొలుచుకొన్నపుడే బలిచక్రవర్తి కూడ ఆ పాదం క్రిందనే కొలువబడ్డాడు. మూడవపాదము ఏమి పుచ్చుకొన్నాడో చెప్పండి.

పూర్ణయ్య :- చెప్పడానికి ఏముంది? నాబొందవుందా! భలేచిక్కు పాయింట్లు అడిగి చీకాకు పెడుతున్నావు.