పుట:Prabodhanandam Natikalu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒరేయ్‌ నేను బుద్ధి తెలిసినప్పటి నుండి పురాణాల్ని శోధిస్తున్నానుగానీ, ఈ సంగతే అర్థము కాలేదు. ఇది చాలా అర్థరహితముగ యదార్థ విరుద్ధంగా ఉందని ఒప్పుకుంటున్నాను నాయనా

వేణు :- ఒప్పుకుంటున్నావు కదా! ఇంకొక విషయం అడుగుతాను, గజేంద్ర మోక్షం అనే ఘట్టంలో శ్రీహరి అయిన విష్ణుమూర్తి ఎక్కడున్నట్లు కవులు వర్ణించారో తెల్పు తాత.

పూర్ణయ్య :- (హీన స్వరముతో) అలాగే వివరిస్తాను నాయనా విను (కింది పద్యం గట్టిగా చదువును మొదలుపెట్టును)


మ॥

 అల వైకుంఠ పురంబులో నగరులో నామూల సౌధంబుదా
   పలమందారవనాంతరామృతసరః ప్రాంతేందు కాంతోపలో
   త్పలపర్యంక రమావినోది యగునాసన్న ప్రసన్నుండు వి
   హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై.


వేణు :- ఏమీ వైకుంఠమనే పురంలో, ఒక వీధిలో, ఒక మూలగల మేడలో, శేషపాన్పుపైన, లక్ష్మిదేవితో వినోదములాడుతూ, సంతోషముగా ఉన్నాడ నియేగా ఆ పద్యములోని అర్థము. సరే మరి ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు తన కుమారున్ని నీ శ్రీహరి ఎక్కడున్నాడని అడిగినపుడు


కం॥

యిందుగల డందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
అందందే గలడు దానవాగ్రణి వింటే

అని వల్లించినాడే, ఈ రెండు విధానాల్లోను ఏ దాన్ని నమ్మ మంటావు? ఒకచోట వైకుంఠపురంలో ఉన్నాడని, ఒకచోట ఎక్కడ చూచినా ఉన్నాడని తెలిపే ఈ పురాణకవుల ఏ మాట నిజమైందంటారు తాతగారు?