పుట:Prabodhanandam Natikalu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేణు :- నామాటకు సమాధానము చెప్పు, పురాణాలు వ్రాసిందెవరు మానవులే కదా! మరి వారిలో జ్ఞానం ఎంత ఉంటే అవి అంతే ఉంటాయి కదా! కవితాశక్తి ఎంతైనా ఉండి పెద్దకవులు కావచ్చును, కానీ వారిలో అసలైన జ్ఞానశక్తి ఉండాలికదా! ఏ జ్ఞానము లేకుండా, శాస్త్రబద్దము కాకుండా చెప్పిన మాటలు హేతువాదం చేత ఖండింపబడతాయి. కావాలంటే నీవిప్పుడు చెప్పిన పురాణఘట్టాల్లోని కొన్ని అంశాలు యదార్థానికి ఎంత వరకు నిలువగలవో అడుగుతాను చెప్పగలవా?

పూర్ణయ్య :- ఓరి పిల్లపిడుగా! నా అనుభవములో పదోవంతు లేదు కదరా నీవయస్సు. పిల్లవచ్చి గ్రుడ్డును వెక్కిరించినట్లు నన్నే పరీక్షిస్తావురా! నీవి పనికిమాలిన ప్రశ్నలుంటాయి. ఆ ఆ కానీ. ఏంటివో ఆ ప్రశ్నలు రానీ బయటకు.

వేణు :- నేనడిగిన ప్రశ్నలకు నీవు సరైన సమాధానము చెప్పకపోతే?

పూర్ణయ్య :- నీవు అడిగే బోడిప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేనా! ఓరేయ్‌ నాపేరేంటనుకున్నావు పురాణాల పూర్ణయ్య, సమస్త పురాణాల్ని కాచివడగట్టినవాణ్ణి, నీ సందేహాల్నే తీర్చకపోతే, ఇదిగో నిత్యం భక్తితో పఠించే ఈ పురాణాలను ఏటిలో పారవేసి ఎవ్వరికి చెప్పకుండా పురాణ సన్న్యాసం చేస్తాను సరేనా!

వేణు :- సరేగాని నీవు చెప్పింది నమ్మమంటావా?

పూర్ణయ్య :- (భాగవతం తలపై పెట్టుకొని) ఈ భాగవతం సాక్షిగా చెప్పుతున్నాను. మాటతప్పితే ఏమంటివిరా ముసలిగాడిదా అను.

వేణు :- ప్రహ్లాద చరితల్రో ఒక ఘట్టంలోని అంశమును అడుగుతాను చెప్పు. హిరణ్యకశిపుడు తనకు చావులేకుండ వరాలు పొందడానికి తపస్సు ఎవరిని గూర్చి చేశాడు? ఎక్కడ చేశాడు? ఎన్ని సంవత్సరాలు చేశాడు.