పుట:Prabodhanandam Natikalu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేణు :- ఓహో అలాగున తాతగారు ఐతే విను

తే॥గీ॥

నీవు జెప్పు పురాణముల్‌ నిజముగాదు
శాస్త్రవిది గొప్ప దెప్పుడు సత్యముగను
పుక్కిటి పురాణములండ్రు బుధులువాని
ముక్తి త్రోవను జూపవో ముసలి తాతా


పూర్ణయ్య :- హవ్వ! హవ్వ! ఎంత మాటంటివిరా శుంఠ మనువడా! పురాణాలన్నీ అబద్దాలా, శాస్త్రసమ్మతం గానివా! అసలు పుక్కిటి పురాణాలా? శివశివా! ఎంత అపచారం, ఎంత అపచారం. ఓ శ్రీమన్నారాయణ మూర్తీ! నీ విలాసాలకు నిలయమైన పురాణాల్ని తప్పుబట్టిన ఈ కుర్రకుంకను క్షమించు. ఓరేయ్‌ బడుద్దాయ్‌! ఇదేం పొయ్యేకాలంరా నీకు, శ్రీవిష్ణు స్వరూపుడైన వ్యాస భగవానుని విరచితము, భక్తశిఖామణియైన బమ్మెర పోతనగారు రచించిన మహాపవిత్రమైన పురాణాన్ని దోషాలెంచితే, కాశీలో గోవును చంపినంత పాపమొస్తుంది! తప్పని ముక్కు, చెంపలేసుకో.

వేణు :- ఓ నాతండ్రికి తండ్రిగారు! తప్పని నేనే ముక్కు చెంపలేసు కోవలయునా, అర్థాపర్థము లేకుండా అడ్డ ద్రోవలు చూపించే కల్పిత పురాణాల్ని నీలో జీర్ణింప చేసుకొని, తాజెడ్డ కోతి వనమెల్లా చెరచినట్లు ప్రజలకు బోధించి, వారిని కూడా పెడద్రోవలు పట్టిస్తుది మీరుకాదా! ఆశ్రమాలకు పోయి అసలైన ధర్మాలు తెలుసుకొంటున్న నన్నే తప్పంటావా?

పూర్ణయ్య :- తప్పా! తప్పున్నారా! తర తరాలనుండి మన హిందువులకు పూజ్యనీయమై, భక్తిగా ఆరాధించే పురాణాల్ని, యదార్థానికి నిలువవనీ, కల్పితాలనీ నోటికి వచ్చినట్లు ప్రేలుతావురా! ఆశ్రమానికి పోయిన నీకు మీ గురువు బోధించిన జ్ఞానం ఇదేనా? వ్రేలడంత లేవు! నాకు ఇష్టమై నిష్టగా పఠించే పౌరాణిక గ్రంథరాజాన్ని నా ఎదురుగానే కాదంటవురా!