పుట:Prabodhanandam Natikalu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణుణ్ణి కూడ నిందించారు. ఈనాటికి ఆయన మీద మంచి అభిప్రాయము లేదు. భగవంతుడైన కృష్ణుణ్ణే జారుడు, చోరుడు అని ప్రచారము చేయుచున్నారు. కలియుగములో యోగీశ్వరుడైన ఆచార్య ప్రబోధానంద యజ్ఞముల వలనగానీ, వేదపఠనములవలనగానీ, దానముల వలనగానీ, తపస్సుల వలనగానీ దేవుడు తెలియబడడని చెప్పుచూ, గీతను ఆధారముగా చూపుచున్నప్పటికి, హిందువులమని పేరుపెట్టుకొన్న వారికే నచ్చక, ఆయనను కూడ చెడుగానే చెప్పుకొంటున్నారు. త్రేతాయుగములో బ్రహ్మ అని పేరు గాంచిన నన్నుగానీ.... ద్వాపరయుగములో భగవంతుడని గుర్తింపు వచ్చిన కృష్ణున్నిగానీ.... వదలక, చెడుగా చెప్పుచున్న మానవులు, కలియుగములో యోగీశ్వరుడని పేరుగాంచిన ఆచార్య ప్రబోధానందను చెడుగా చెప్పకుండా వదులుతారా?

ఇటు నన్ను, అటు యోగీశ్వరులను మానవులుగా లెక్కించితే లెక్కించవచ్చు. మా మాటలను అజ్ఞానముగా పోల్చితే పోల్చవచ్చు, మమ్ములను దుర్మార్గులుగా భావించితే భావించవచ్చును. కానీ సాక్షాత్తు దేవుని అవతారమైన కృష్ణుడు చెప్పిన మాటలనైనా కలియుగములోని మనుషులు నమ్మగలిగారా? కృష్ణుడు భగవద్గీతను బోధించుచు అందులో అక్షర పరబ్రహ్మయోగమను అధ్యాయములో 28వ శ్లోకమున యోగి అయిన వాడు వేదపారాయణము చేయువారికంటే, యజ్ఞములు చేయువారికంటే, దానములు చేయువారికంటే, తపస్సులు చేయువారికంటే అధికుడనీ, వారి పుణ్యములకంటే అధికశక్తికలవాడనీ తెలియజేశాడు కదా!

విశ్వరూప సందర్శన యోగములో 48 శ్లోకమున మరియు 58 శ్లోకమున తపములచేతగానీ, దానములచేతగానీ, వేదాధ్యయనముల వలన గానీ, యజ్ఞముల వలనగానీ దేవుణ్ణి తెలియుటకు శక్యముకాదని చెప్పాడు కదా!