పుట:Prabodhanandam Natikalu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండితులు :- ఊ..ఊ.. అని మూల్గుచు వింటాను అని సైగ చేశాడు.

భటులు :- మాలో దైవశక్తి అయిన జ్ఞానశక్తియుంటే, మాశక్తి వలన వీరి కర్మకాలిపోయి నోటమాట వచ్చునుగాక. అని అంటూనే పండితులకు నోట మాటలువచ్చాయి. మీరు యజ్ఞము చేయుచున్నారు కదా! యజ్ఞమంటే నిజార్థము తెలుసా?

పండితులు :- తెలుసా అంటే కొంత తెలుసు.

భటులు :- ఏమి తెలుసో చెప్పండి?

పండితులు :- దేవతలకు ఫ్రీతికొరకు, దేవతలకు మనమిచ్చు వస్తువులు చేరుటకొరకు యజ్ఞము చేస్తున్నాము.

భటులు :- దేవతలా! ఎవరా దేవతలు! తమకంటే గొప్ప ఒక దేవుడు ఉన్నాడని, వారే దేవుణ్ణి భక్తిగ మ్రొక్కుచుంటే, అసలైన దేవుణ్ణి వదలి వేరే వారికి దేవతలని పేరుపెట్టి, మీరు యజ్ఞములు చేయడము జ్ఞానమంటారా?

పండితులు :- మేము వేరే దేవతలకు యజ్ఞము చేయలేదు, భూమాతకు చేస్తున్నాము.

(అంతలో విచిత్రశబ్దము ఏర్పడినది. అట్టహాసము చేయుచు శరీరమంతా మట్టినిండిన వ్యక్తి అక్కడికి వచ్చాడు.)

భూమి :- ఓరీ పండితులారా! నేను భూమిని మాట్లాడుచున్నాను. మీరు అధర్మమైన యజ్ఞములు చేయడమేకాక, నన్ను కూడ కలుపుకొని నాపేరుతో యజ్ఞము చేయుదురా! యజ్ఞమే ఒక పెద్ద అధర్మమూ, అజ్ఞానమూ అయితే, అందులో నన్ను కూడ ఇరికించి భూమాతాయజ్ఞమనీ, నాపేరు పెట్టి ఎందుకు చేయుచున్నారు.