పుట:Prabodhanandam Natikalu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరాశక్తి అందరికీ తల్లివంటిది ఆమెకు భర్త అయిన దేవుడు ప్రత్యేకముగా ఉన్నాడు" అని అన్నాడు.

ఎల్లయ్య :- దేవతలందరికీ పెద్దయిన విష్ణువుకే ఆమెతల్లి అయినపుడు విష్ణువుకంటే ఏ దేవుడు పెద్దలేనపుడు ఆదిపరాశక్తియే కదా అందరికీ పెద్ద.

గిరి :- ఆదిపరాశక్తి అయిన ఆమెకు కూడ భర్తగలడు. ఆయనే అసలైన దేవుడు. ఆయననే కొందరు సృష్ఠికర్తయని, కొందరు పరమాత్మయనీ, కొందరు దేవుడని అనుచున్నారు.

ఎల్లయ్య :- నారాయణమూర్తి అయిన విష్ణువునే దేవుడని అందరూ అంటున్నారు కదా! ఆయనను పుట్టినంచిన ఆదిపరాశక్తియే కదా పెద్దది.

గిరి :- పరాశక్తికి పుట్టినవాడు సృష్ఠింపబడినవాడే కానీ సృష్ఠికర్త కాదుకదా! అటువంటపుడు విష్ణువును దేవుడని సృష్ఠికర్తయని ఎలా అనాలి?

ఎల్లయ్య :- అయితే నీ దేవుడు ఎవడో చెప్పు? ఎక్కడుంటాడో చెప్పు? ఏమి చేస్తుంటాడో చెప్పు?

గిరి :- ఎవడని చెప్పను! ఆయనకు పేరేలేదు, ఆకారము అంతకూలేదు, ఎక్కడుంటాడని చెప్పను? ఆయన అంతటా వ్యాపించి, అంతటా ఉండువాడు. ఆయన ఏమీ చేయడు. తన సంకల్పముతోనే ప్రకృతియే అన్నీ చేసి పెట్టుచున్నది. నిజానికి ఆయనెవరో భూమిమీద ఎవరికీ తెలియదు.

ఎల్లయ్య : -ఆయనెవడో ఎవరికీ తెలియనపుడు ఆయనతో మనకేమి పని?

గిరి :- మనము జీవులము కనుక, శరీరమను జైలులో చిక్కిన వారము కనుక, ఆయనశక్తిని మనము పొందనిదే, ఎవడూ దేహ ఖైదునుండి బయటపడడు కనుక, ఆయనే దేవుడు కనుక, ఆయనను తెలుసుకొనుటయే ప్రతి మనిషికి ముఖ్యమైన పని.