పుట:Prabodhanandam Natikalu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణుడు :- ఇపుడు ఎదురుగా వచ్చావు దానికే స్నానము చేయాలి, ఒకవేళ నన్ను తగిలియుంటే మూడురోజులు శుద్ధికార్యము చేసుకోవలసి వచ్చేది.

చండాలుడు :- నేను నిన్ను తగలలేదు కదా! ఎదురుగా వచ్చినందుకు నీకేమి అంటుకొన్నది?

బ్రాహ్మణుడు :- చండాల దర్శనమే మహాపాపమ్‌ అని వేదాలలో వ్రాసియుంది. తగిలితే మరీ పాపమని కూడ ఉంది. నీవు మాదిగవాడివి నేను బ్రాహ్మణున్ని అందుకే అంతగా చెప్పేది.

చండాలుడు :- నీవు బ్రాహ్మణునివి, నేను మాదిగవాడినా? అయితే ఇపుడొక మాట అడుగుతాను చెప్పగలవా? నీవు బ్రాహ్మణునివని, నేను దిగువవాడినని ఎలా చెప్పగలుగుచున్నావు?

బ్రాహ్మణుడు :- నేను పుట్టుకతోనే బ్రాహ్మణకులములో పుట్టాను. కనుక బ్రాహ్మణున్ని, నీవు మాదిగకులములో పుట్టావు. కనుక మాకు దిగువవానివే. ఇందులో ఏమైనా సంశయమా?

చండాలుడు :- బ్రాహ్మణుడని, దిగువవాడని పుట్టుకతోరాదు. వాడు చేసే పనినిబట్టి, వానికున్న గుణమునుబట్టి ఉండునని భగవద్గీతలో కూడ చెప్పారు. బ్రహ్మజ్ఞానము కలవానిని బ్రాహ్మణుడని, బ్రహ్మజ్ఞానము లేని వానిని వానికంటే దిగువవాడని ఒక గురువుగారు కూడ చెప్పారు. ఆయన చెప్పిన దానినిబట్టి, జగతిలో రెండే కులములున్నవనీ, దైవజ్ఞానము తెలిసిన వాడు ఎగువ కులమువాడనీ, జ్ఞానము తెలియనివాడు వానికంటే దిగువ కులమువాడనీ తెలియుచున్నది. ఇపుడు బ్రహ్మజ్ఞానమును నీకంటే నేనే ఎక్కువ తెలిసినవాడిని కాబట్టి నేనే బ్రాహ్మణున్ని, తక్కువ తెలిసినవాడివి కాబట్టి నీవే దిగువవానివి.