పుట:Prabodhanandam Natikalu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధికారము, నీ హోదా కొంతకాలమేనని, నీవు సాధారణ జీవాత్మవేనని తెలుసుకో. కింకరులారా చివరిగానున్న అతనిని కూడ ప్రవేశపెట్టండి. (యమకింకరులు రాజకీయనాయకుణ్ణి ముందుకు తెచ్చారు.)

చిత్రగుప్తుడు :- మీరు రాజకీయములోని మంత్రివర్యులు అధికారమే అన్నిటి కంటే మించినదిగా తలచినారు అధికారముంటే డబ్బు దానంతటికదే వస్తుందని తలచినారు. అధికారము కొరకు ఎన్నో హత్యలు చేయించినారు. అధికారముతో ఎన్నో అక్రమాలు చేసిన తమరు, పాపమును కూడ అదే మాదిరి సంపాదించుకొన్నారు. తమరు చేసిన పాపములు ఏవీ చిన్నవిలేవు. అధికారమును కాపాడుకొనే దానికి, పోలీసులచేత చాలామందిని జైళ్ళలోనికి త్రోయించావు. కొందరిలో గ్రామకక్షలు పెంచి హత్యలు చేయించావు. కోట్ల ఆస్తులు సంపాదించావు. అయినా నీవెంట ఒక్కరూపాయి కూడ రాలేదు కదా! ఇపుడు నీవెంట కోట్లరూపాయలకు సమానమైన పాపము వచ్చినది. దానిని అనుభవించుటకు ఒక జన్మసరిపోదు. ఈ భూమిని ఎందరో రాజులు నీకంటే గొప్పగ పరిపాలించారు. ఒక్కడు కూడ పిడికెడు మట్టిని కూడ వెంట తీసుకుపోలేదు. నీ తర్వాత కూడ ఎందరో రాజకీయము లో మంత్రులుగా ఉండగలరు. వారుకూడ అంతే. ఎవరూ ఏమీ మూటగట్టుక పోరు, మూటకట్టుక పోయేది పాపము మాత్రమే. నీ పాపము మూటకు సమానమైన శిక్షను యమధర్మరాజు చెప్పగలడు. (అంతలో చిత్రగుప్తుడు మరొక ప్రక్కయున్న జ్ఞానులవైపు చూచి) మీరు జ్ఞానమార్గములో ఉన్నవారు, మీ హోదాను నేను గుర్తించలేను. మీ పాప పుణ్యములను స్వయముగా యమధర్మరాజే చెప్పగలడు. (అంతలో యమ ధర్మరాజు సభలోనికి వచ్చు సూచనగా శబ్దము వినిపిస్తుంది.) జీవాత్మలకు సమవర్తి అయిన, శరీరాంతర్గత బహిర్గత నివాసి అయిన, మాయను తిరగ వ్రాసిన