పుట:Prabodhanandam Natikalu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడినని, నా జ్ఞానము గొప్పదని, నేను స్వచ్ఛమైన ధర్మపరుడినని తెలిసి ఇప్పటికి నన్ను గురించి చెప్పు ప్రబోధ సేవాసమితి వారున్న చోటికి వచ్చాను, మనసువిప్పి మాట్లాడాను. యజ్ఞములు, వేదములు, ధానములు, తపస్సులు దేవుని ధర్మములు కావను గీతవాక్యమును గుర్తుంచుకొనిన వారి హృదయా లలో ఎప్పటికి ఉంటాను. ఇక సెలవు...

-***-


నాయనగంటు - అమ్మగంటు

అది భూలోకములోనే యమధర్మరాజు కొలువు తీరిన సభ, మధ్యలో యమధర్మరాజు యొక్క సింహాసనముండగా ప్రక్కనే చిత్రగుప్తుని ఆసనము ఉంటుంది. అక్కడ మొదట ఇద్దరు యమకింకరులు, ఒక పోలీస్‌ అధికారిని, ఒక రాజకీయనాయకుణ్ణి, ఒక వడ్డీవ్యాపారస్తుణ్ణి, ఒక ఉద్యోగస్థుణ్ణి తీసుకు వచ్చి ఒక్క ప్రక్క నిలబెడుతారు. వేరొక ప్రక్కన ఆధ్యాత్మికవేత్తను, ఒక శైవుడిని, ఒక వైష్ణవుడిని కూర్చోబెడతారు. అంతలో ముందుగా చిత్రగుప్తుడు ప్రవేశించి యమకింకరులను చూచి...

చిత్రగుప్తుడు :- కింకరులారా ఈ దినము, ఈ గంటలో, ఈ జిల్లాలో ఆయుస్సు తీరిన వారు కేవలము ఏడుగురేనా?

కింకరులు :- అవును చిత్రగుప్తా! ఈ ఏడుమంది మాత్రమే కలరు.

చిత్రగుప్తుడు :- ఈ నలుగురిని ఒక ప్రక్క నిలబెట్టి మిగత ముగ్గురిని మరొక ప్రక్క ప్రత్యేకముగా కూర్చోబెట్టారు దేనికి?

కింకరులు :- ఈ నలుగురు వేరువేరు పనులు చేయుచున్ననూ సర్వ సాధారణ మనుషులే. ప్రక్కనున్న ఈ ముగ్గురు జ్ఞానమును తెలిసిన గొప్పవారు, అందువలన ప్రక్కన కూర్చోబెట్టాము.