పుట:Prabodhanandam Natikalu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నడచినవాడను నేను, భగవద్గీతకు వ్యతిరేఖముగ నడచిన వాడు రాముడు. రాముడు ధర్మపరుడు, రావణుడు అధర్మపరుడనుకున్న ఈ కాలపు గ్రుడ్డి ప్రజలను అడుగుచున్నాను. ఇప్పుడు చెప్పండి ఎవరు ధర్మపరుడో, ఎవరు అధర్మపరుడో.


ధర్మము ప్రకారము యజ్ఞములను నాశనము చేసిన నన్ను దుర్మార్గుడని ప్రజలచేత నమ్మించి, వారి భుక్తికొరకు రాజుల దగ్గర ధనమును తీసుకొని యజ్ఞము చేయుట, ద్వాపరయుగములో పెరిగిపోవడమును గమనించిన దేవుడు తానే శ్రీకృష్ణునిగ భూమిమీదకు వచ్చాడు.

శ్లో॥

యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌ ॥

ఎప్పుడైతే ధర్మములకు ముప్పుకలుగుతుందో అపుడే నేను భూమి మీద అవతరిస్తానని చెప్పిన దేవుడు, వ్యాసుడు మొదలగు మహర్షులని పేరుగాంచిన వారున్నపుడే భూమిమీద అవతరించాడు. దీనినిబట్టి యజ్ఞములు పెచ్చుగ చేయు మహర్షులు అధర్మపరులనేగా అర్థము! దీనిని బట్టి యజ్ఞములను రక్షించినవాడు ధర్మపరుడా? యజ్ఞములను చెడగొట్టిన వాడు ధర్మపరుడా? ఎవడు ధర్మపరుడో యోచించండి.


ఇకపోతే నేను అజ్ఞానినని, దైవభక్తి ఏమాత్రము లేనివాడినని, సుందరకాండయని పేరుపెట్టి పాట పాడువారు కూడ కలరు. పరబ్రహ్మ స్వరూపమైన, పురుషోత్తమునికి మారురూపమైన ఈశ్వరలింగమును పూజించాను, కానీ అన్యదేవతను ఎక్కడా నేను ఆరాధించలేదే! దేవునికి అన్యముగనున్న దేవతలను, సూర్యున్ని ఆరాధించిన ఘనత రామునికున్నదే కాని, నాకు లేదే! విశ్వమంతా వ్యాపించిన ఈశ్వరుడయిన పరమ్మాతను ఆరాధించిన నేను దైవభక్తి లేనివాడినా!