పుట:Prabodha Tarangalul.pdf/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


758. దేవుడు మనిషిని మాయలో పుట్టించి తర్వాత తనవద్దకు వస్తాడో రాడో, తనను గుర్తిస్తాడో లేదో చూడాలనుకొన్నాడు. ఆ ప్రక్రియలో మొదటిదే నిన్ను ఒక మతములో పుట్టించడము. బాగా చూచుకొంటే నీవు ప్రస్తుతము మాయలో ఉన్నావు, దేవుని వైపుపో.

759. మనము ఎక్కడినుండి ఎక్కడకు పోవాలని ప్రశ్నిస్తే మాయవైపు నుండి దేవునివైపు పోవాలన్నది జవాబు. అనగా నీవు ముందే మాయవైపు ఉన్నావని అర్థము. నేను పలానా మతస్థుడనని అనుకోవడము మాయ. నా దేవుడు పలానా వాడనుకోవడము మరీ పెద్ద మాయ. సృష్ఠికి అంతా ఒకే దేవుడు అధిపతి.

760. నీకు ఒక పేరునూ, నీకు ఒక కులమునూ, అలాగే ఒక మతమునూ ఇతరులే నీకు మొదట కరిపించారు. దేవునికి పేరుందా? కులముందా? మతముందా? అవి ఏవి లేవు. అవి లేని వానిని తెలుసుకోవాలంటే నీవు నీ పేరునూ, కులమునూ, మతమునూ దేవుని విషయములో దూరముగా పెట్టుకో.

761. దేవునికి శరీరముకానీ, ఆకారముగానీ లేదు. అటువంటి వానిని ఒక ఆకారముతో ఊహించుకోవద్దు. అలా ఊహించుకొంటే నీ ఊహ తప్పు అవుతుంది. ఆకారమున్నది ఏదైన అది దేవుడు కాదు.

762. దేవునికి ఒక ఆకారమే కాదు. నిద్ర, మెలకువ, ఆకలి, దప్పిక ఏవి లేనివాడు దేవుడు. సర్వమును వ్యాపించివాడు, అన్ని వేళల ఉన్నవాడు, అందరిని గమనిస్తున్నవాడు దేవుడు. ఆ దేవున్నే నీవు తెలుసుకో.