పుట:Prabodha Tarangalul.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోపమేమిటో? నీ మతములోని గొప్పతనమేమిటో? న్యాయముగా, నీతిగా నిర్ణయించుకో.

752. పరమతమును గానీ, నీ మతమును గానీ, స్వార్థబుద్ధితో గానీ, రాజకీయముగా గానీ, సమాజపరముగా గానీ యోచించవద్దు.

753. ఒకవేళ నీ మతము గొప్పగా, పరమతము నీచముగా కనిపిస్తే, మతమును గురించి వదలివేసి, మతము యొక్క ప్రసక్తి లేకుండ కేవలము దేవున్ని గురించే బోధించు, దేవుడు అన్ని మతములకు పెద్ద కావున ఏ మతస్థుడైనా నీ మాట వినగలడు.

754. ఒకవేళ పరమతము గొప్పగా, నీ మతము నీచముగా కనిపిస్తే, నీవు మతమును మాత్రము మారవద్దు. నిన్ను ఈ మతములోనే దేవుడు ఎందుకు పుట్టించాడో యోచించు. అపుడు మత చింతపోయి దైవ చింత కల్గుతుంది.

755. మతము అన్న పేరు ప్రతి వర్గములోను ఉన్నది. నీది ఒక పేరు కల్గిన మతమైతే, మరొకనిది ఇంకొక పేరు కల్గిన మతమై యుండును. మతములో నిన్ను దేవుడే పుట్టించాడు. కానీ నీవు కోరి ఏ మతములో పుట్టలేదు.

756. నిన్ను ఒక మతములో పుట్టించి, ఇంకొకనిని మరొక మతములో దేవుడే పుట్టించాడు. అలా నిన్నూ ఇంకొకన్నీ పుట్టించినది ఒకే దేవుడే! నీవు పుట్టిన తర్వాత దేవునికి నీవే పేర్లు పెట్టుచున్నావు. నిజముగా దేవునికి పేరులేదు, ఆకారము అంతకూలేదు.

757. మతాలకు అతీతముగా, పేర్లకు అతీతముగా, రూపములకు అతీతముగా, క్రియలకు అతీతముగా ఎవడైతే ఉన్నాడో వాడే నిజమైన దేవుడు. అతనే నిన్ను ఈ ప్రపంచమును సృష్టించినవాడు.