పుట:Prabodha Tarangalul.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

684. నీకు తండ్రి పరమాత్మకాగ, తల్లి ప్రకృతి (మాయ) కాగ, ఆత్మ అన్నగ ఉండగ, ఆకలి పెద్దచెల్లెలుగ, ఆలోచన చిన్న చెల్లెలుగ ఉండగ, జ్ఞానము మేనమామగ ఉన్నది.

685. పెద్ద చెల్లెలైన ఆకలికి ఆహారము ఇస్తే కొంతసేపైన ఊరక ఉంటుంది. కానీ చిన్న చెల్లెలైన ఆలోచన మాత్రము ఏమిచ్చినా క్షణము కూడ ఊరకుండక నిన్ను వేధిస్తూనే ఉంటుంది.

686. నీ చెల్లెళ్ళ బాధ తప్పాలంటే నీ మామతో చెప్పుకో. నీ చెల్లెండ్రను ఓదార్చు బాధ్యతగానీ, స్థోమతగానీ నీమామకే గలదు. అందుకే నీ మామను చందమామ అంటున్నాము.

687. నీ అన్న ఇంటిలో, నీ అన్న పనిమనుషుల మధ్యలో నీవు నీ కుటుంబ సభ్యులతో కాపురముంటున్నావు. అది తెలియక అంతా నీ సంసారమే అనుకొంటున్నావు.

688. అండజ, పిండజ, ఉద్భిజములని జీవుల శరీరములు మూడు రకములుగ ఉన్నవి. అందులో అండజ పిండజములు ఆకలి కలవిగా ఉన్నవి. ఉద్భిజములు ఆకలి లేనివిగా ఉన్నవి.

689. ఆకలిగల అండజ పిండజముల వలన రోగములు వ్యాపిస్తున్నవి. ఆకలిలేని మొక్కల వలన ఔషధములు తయారగుచున్నవి. అందువలన శరీరములు మాయకు గుర్తు, మొక్కలు జ్ఞానమునకు గుర్తు.

690. మాయ నీకు చెడును చేస్తుందని తెలుపుటకు శరీరములు దుర్గంధమును, జ్ఞానము నీకు మంచిని చేస్తుందని తెలుపుటకు చెట్లు సుగంధమును కల్గియున్నవి.