పుట:Prabodha Tarangalul.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

674. సం అంటే మంచిదనీ, సారము అనగ రుచి అని అర్థము. దీని ప్రకారము సంసారము అనగ మంచి రుచిగలదని అర్థము.

675. సంసారము దేహములోపల ఉన్నది. దేహములోని సంసారములో సంగీతమును కల్గినవాడు ధన్యుడు.

676. సంసారము సంగీతమయము కావాలి కానీ సాగరమయము కాకూడదు.

677. "సంసారము సంగీతము" అను వాక్యము "సంసారము సాగరము" అను వాక్యము రెండూ కలవు. అందరికి సంసారము సాగరమనే తెలుసు, కానీ సంసారము సంగీతమని తెలియదు.

678. సంసారము ఎవరికి బయటలేదు. అందరికి దేహములోపలే సంసారముగలదు.

679. నీవు నీకన్ను వెనుకలనుండి దృశ్యములను చూస్తున్నావు. నీకన్ను వెనుకల నీవు ఎంతదూరములో ఉన్నావో చెప్పుకోగలవా?

680. మానవున్ని తనవైపు లాగుకొనుటకు మాయకు మొదటి ఆయుధము "ఆకలి".

681. కడుపులో కలుగు ఆకలివలన ధనికుడుగాని, బీదవాడుగాని, జ్ఞానిగాని, అజ్ఞానిగాని బయట ప్రపంచములో ఏమైన చేయుచున్నాడు.

682. మానవున్ని తనవైపు లాగుకొనుటకు మాయకు రెండవ ఆయుధము ఆలోచన.

683. ఆకలి, ఆలోచన రెండు మాయయొక్క ప్రియపుత్రికలు, నిన్ను వీడని చెల్లెండ్లు.