పుట:Prabodha Tarangalul.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

580. ఏ సిద్ధాంతమైన మనిషిది కాదు, వానిలోని ఆత్మది. న్యూటన్‌ సిద్ధాంతమును న్యూటన్‌ కనిపెట్టలేదు. అతని ఆత్మ చెప్పినది.

581. ఊరు అనగ ఊరునదని, లేక ఊట కల్గినదని అర్థము. నీ ఊరు ఏదో తెలుసునా?

582. ఏడు ఊటలు కల్గినది నీ ఊరు. ఏడు ఊటలున్న ఊరు నీ శరీరమేనని తెలుసుకో.

583. శరీరమనే ఊరులో 24 మంది సహచరులతో నీవు నివసిస్తున్నావని మరువద్దు!

584. ఊరులో నీవున్నా ఊరంతా నీవులేవు. ఊరులోపల ఒక ఇంటిలో మాత్రము నీవున్నావు. ఆ ఇల్లు ఒక్కటే నీది.

585. నీవున్న శరీరమంతా నీది కాదు. శరీరములోపల ఒకచోట మాత్రము నీవున్నావు. ఆ చోటు మాత్రమే నీది.

586. ఊరికి ఒక పెద్ద ఉంటాడు అతనిని ఇపుడు సర్పంచ్‌ అని, పూర్వము పాలెగాడు అని అనెడివారు. అలాగే శరీరమునకు ఒక పెద్ద ఉన్నాడు. అతనే ఆత్మ. ఊరును పూర్వము పాలెము అని దాని పెద్దను పాలెగాడు అని అనెడివారు.

587. నేరస్థుడు తన పని ఫలితమైన పాపమును పొందినవాడు. రోగస్థుడు తన పాపఫలితమైన శిక్షను పొందినవాడు.

588. తప్పు ఏదైన నేరము అవుతుంది. ప్రపంచములో అన్యాయముగ ప్రవర్తించినవాడు ఎవడైన నేరస్థుడే అవుతాడు.