పుట:Prabodha Tarangalul.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

467. ఓంకార శబ్దము నోటితో పలికితే వస్తుంది. అదే శబ్దము నోటితో పలుకకుండానే సూక్ష్మముగ శరీరములోపల మ్రోగుచున్నది.

468. ఏ మతమునకు చెందిన మనిషిలోనైన ముక్కురంధ్రములలో కదలే శ్వాసలో "ఓమ్‌" శబ్దము ఇమిడి ఉన్నది.

469. "ఓమ్‌" ఒక మతమునకు సంబంధించినది కాదు. మనుషులందరికి, జీవరాసులందరికి సంబంధించినది.

470. ఓమ్‌ శబ్దమునకు శ్వాస కారణము, శ్వాసకు కారణము ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచములు కారణము, ఊపిరితిత్తుల కదలికకు శరీరమధ్యలోనున్న బ్రహ్మనాడిలో గల స్పందన కారణము. బ్రహ్మనాడిలోని స్పందనకు అక్కడున్న ఆత్మ కారణమై ఉన్నది.

471. ఇంద్రియార్థమైన శబ్దముతో కూడి మంత్రమైన "ఓం నమః శివాయ" అను మంత్రమును పంచాక్షరి అంటున్నారు.

472. పంచాక్షరిలో ఐదు అక్షరములు గలవని గుర్తించాలి. "ఓం" ను అక్షరముగ గుర్తించుకోకూడదు, ఓంను మినహా ఉన్నది ఐదక్షరములే కదా అని సమర్థించుకొన్నట్లయితే "ఓం నమోనారాయణాయ" అను మంత్రమును అష్టాక్షరి మంత్రము అనకూడదు. ఎందుకనగా ఓంను తీసివేసి చూస్తే ఏడు అక్షరముల మంత్రమే అగును.