పుట:Prabodha Tarangalul.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


389. పురాణము పుక్కిడినుంచి, శాస్త్రము బొడ్డు దగ్గర నుండి వచ్చునను నానుడి కలదు. అందువలన అసత్యములతో కూడుకొన్నది పురాణము. సత్యములతో కూడుకొన్నది శాస్త్రము అని చెప్పవచ్చును.

390. శాసనములతో కూడుకొన్నది శాస్త్రము, కల్పనలతో కూడుకొన్నది పురాణము.

391. విషయమును మననము (జ్ఞాపకము) చేయునది మనస్సు.

392. మనస్సును చంచలమైన క్కుతో, నీచమైన పందితో , బలమైన ఏనుగుతో పోల్చి కొందరు పెద్దలు చెప్పినారు. కావున మనస్సు ఒక విషయము మీద నిలకడ లేనిది. నీచాతి నీచమైన విషయములను ఆలోచించునది, మరియు కట్టడి చేయాలనుకొన్న వానికి లొంగక బలమైనది.

393. మనస్సు మెలుకువలో ఒక ఆకారమును, నిద్రలో మరొక ఆకారమును కల్గి ఉన్నది.

394. మెలుకువలో శరీరాకృతిని పోలిన మనస్సు నిద్రలో ధూళి కణమంతయిపోవుచున్నది.

395. మనస్సు అజ్ఞానులలోకంటే సాధన చేయు వారిలో ఎక్కువ వేగముగ చలించుచుండును.

396. శరీరములో మనస్సు రెండు విధముల పని చేయుచున్నది. ఒకటి విషయములను జ్ఞాపకము తేవడము, రెండు బుద్ధి చెప్పిన దానిని బయటి ఇంద్రియములకు చేర్చడము, బయటి ఇంద్రియములు చెప్పిన దానిని లోపలి బుద్ధికి తెలుపడము.