పుట:Prabodha Tarangalul.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

332. మనిషికి శత్రువులుగ మిత్రులుగ ఉన్న గుణములను మంచి చెడు గుణములంటున్నాము.

333. శరీరములో చెడు గుణములు పనిచేసినట్లు మంచి గుణములు పనిచేయవనియే చెప్పవచ్చును.

334. మంచయిన చెడు అయిన రెండు మాయయే. మంచీ చెడూ కానిదే దైవము.

335. చెడు గుణముల వలన పాపము, మంచి గుణముల వలన పుణ్యము సంభవించును. మంచి చెడు గుణముల పనిలేనపుడే కర్మ అంటకపోవును.

336. శరీరములోని గుణముల వలననే ఆలోచనలు వస్తున్నవి. ఆలోచనల వలననే పనులు, పనులవలననే కర్మ కల్గుచున్నది.

337. గుణముల వలన విషయము మనస్సుకు జ్ఞాపకము రాగ, దాని మంచి చెడులను రెండు విధములుగ బుద్దియోచించగ, ప్రారబ్దకర్మ ప్రకారము చిత్తము నిర్ణయింపగ, ఆ విధముగనే ఇంద్రియములు పనిచేయుచున్నవి.

338. పనులతో గానీ, గుణములతో గానీ ఏ సంబంధములేని అహము జీవునితో కలసి అన్నిటికి నేనే కర్తననునట్లు జీవున్ని భ్రమింప చేయుచున్నది.

339. అహము అనునది గుణము కాదు, జీవునకు అంటుకొని ఉన్న ఒక పొర.

340. అహమునకు శరీరములో ప్రత్యేకమైన స్థానము లేదు. అది జీవునిలోని ఒక భాగమే.