పుట:Prabodha Tarangalul.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


196. కర్మ తీరకపోతే కాయమే నీవు, కర్మ తీరిపోతే కాలమే నీవు.

197. రాత్రి గూటిలో నిద్రించి పగలు మేతకై విహరించే పక్షిలాంటిది మనస్సు. సుషుప్తిలో ఆత్మ అనే గూటిలో నిద్రించి ఎరుకరాగానే విషయాలకై విహరిస్తుంటుంది.

198. నీకు ఆత్మయే మిత్రుడు, కానీ అజ్ఞానముతో శత్రువుగా మార్చుకొన్నావు. నీకు ప్రకృతియే శత్రువు, కానీ అజ్ఞానముతో మిత్రునిగా భావిస్తున్నావు.

199. ఆకలి లేనివానికి అన్నముబెట్టుట, అయిష్టునకు ఆత్మజ్ఞానము చెప్పుట ప్రయోజనములేని పనియగును.

200. విషయాలకు నీవు దూరమైతే విశ్వేశ్వరుడు నీకు దగ్గరౌతాడు.

201. అహంకారముతో ఆత్మనారాధించకు. అహంకారం వదిలివేసి ఆత్మను ఆరాధిస్తే పరమాత్మను చేర్చగలదు.

202. నీ శరీరం చేసే పనులకూ, నీకూ, సంబంధము కల్గిస్తున్నదేదో తెలుసుకో! అదే అహంకారము.

203. అన్నింటితోనూ సంబంధముపెట్టుకో, కానీ అహంకారముతో మాత్రం వద్దు.

204. గుణాలు ఒక్కొక్కటి ఏనుగంత బలమైనవే కానీ జ్ఞానమనే అంకుశానికి గజగజలాడుతాయి.

205. నీ శరీరములోనుండి నీకు కనిపించకున్న ప్రకృతికి (గుణములు) శరీరం బయట నీకు కనిపిస్తున్న ప్రకృతికి అవినాభావ సంబంధమున్నది. వాటి సంఘర్షణ ఫలితమే నిన్ను సతమతపరుస్తున్నాయి.